ఓ పక్క తండ్రి, ఇంకో పక్క కొడుకు.. ఇద్దరూ చెప్పేది ఒకటే మాట. కేంద్రంతో పంచాయితీ పెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదట. కేంద్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి సహకరించదట. కేంద్రానికి తాము సాగిలాపడ్తున్న వైనాన్ని కవర్ చేసుకునేందుకు, చంద్రబాబు, ఆయనగారి పుత్రరత్నం నారా లోకేష్ చెబుతున్న కథలో భాగమే ఇదంతా.!
తెలంగాణలో బీజేపీ విపక్షం. కర్నాటకలో అయితే ప్రతిపక్షం. తమిళనాడులో అసలు బీజేపీకి సీనే లేదు. మొన్నీమధ్యనే పంజాబ్‌లోనూ బీజేపీకి చుక్కలు కన్పించాయి. బీహార్‌లో బీజేపీ అధికారంపై ఆశలు పెట్టుకుని, భంగపడింది. ఢిల్లీలో సంగతి సరే సరి. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. కానీ, ఆ రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం మానేసిందా.?
ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తమిళనాడుకి కేంద్రం ఎడా పెడా నిధులు అందిస్తోంది. హుద్‌హుద్ తుపాను దెబ్బకి విశాఖ విలవిల్లాడితే కేంద్రం పట్టించుకోలేదు. అదే, చెన్నయ్‌కి వరదలొస్తే మాత్రం ప్రధాని నరేంద్రమోడీ వరాల జల్లు కురిపించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో టీడీపీ భాగస్వామి. మరి, అలాంటప్పుడు, ఆంధ్రప్రదేశ్‌కి ఇంకెంత గొప్పగా నిధులు రావాలి.?
అన్నిటికీ మించి, బీజేపీ - టీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటెందుకు వేసినట్లు.? ప్రత్యేక హోదా వస్తుందనీ, రైల్వే జోన్‌ని తీసుకొస్తారనీ, రాజధాని అమరావతికి సహకారమందిస్తారనీ, పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తారనీ. వీటిల్లో ఏ ఒక్కటీ జరగలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమైతే జరుగుతుంది. చంద్రబాబు చెబుతున్న లెక్కలకీ, అక్కడ జరుగుతున్న పనులకీ పొంతన లేని పరిస్థితి. రాజధాని అమరావతిలో ఇంకా అధికారిక నివాసం ఒక్కటి కూడా (తాత్కాలిక సచివాలయం మినహా) ప్రారంభమే కాలేదాయె.!
కానీ, టీడీపీ - బీజేపీ కలిసే వుండాలట. తాజాగా, చినబాబు నారా లోకేష్ మరోమారు ఇదే విషయాన్ని సెలవిచ్చారు. 'కేంద్రంతో సఖ్యతగా వుండకపోతే నరేగా పథకం మనకి వచ్చేదా.?' అంటూ అమాయకంగా ప్రశ్నించేశారాయన. తనను సోషల్ మీడియాలో 'పప్పు' అంటూ కొందరు కామెంట్ చేస్తూ, సెటైర్లు వేయడంపై గుస్సా అవుతున్న లోకేష్ టీడీపీ - బీజేపీ పొత్తు గురించి, కేంద్రం - రాష్ట్రం సంబంధాల గురించి ఇంత అవగాహనా రాహిత్యంతో మాట్లాడటమేంటట.?
సరే, లోకేష్ చెబుతున్నదే నిజమనుకుందాం.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అన్నట్టు, కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం.. టీడీపీ మళ్ళీ ఏపీలో అధికార పీఠమెక్కిందే అనుకుందాం.. అప్పుడు, టీడీపీ - కాంగ్రెస్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తుందా.? చెయ్యాలి కదా, కేంద్ర - రాష్ట్ర సంబంధాలు దెబ్బతినకూడదు మరి.!