పరిటాల అనైతిక రాజకీయమా.. ఏముందిలే!

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ఎంపీపీ ఎన్నిక రచ్చ రచ్చగా ముగిసింది. సిట్టింగ్ ఎంపీపీని తెలుగుదేశం వాళ్లు రాజీనామా చేయించి, తమకు అనువైన మరొకరిని ఎంపీపీగా గెలిపించుకున్నారు. ఈ విషయంలో మంత్రి పరిటాల సునీత అరాచకంగా వ్యవహరించారని, బెదిరింపులకు పాల్పడి, అసలు ఎన్నికే జరగకుండా ఎంపీపీ ని ప్రకటించేశారని .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

మరి వాస్తవ బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే.. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కనగానపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఆరు చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం ఐదు స్థానాలకు పరిమితం అయ్యింది. కానీ.. ఎంపీపీ  ఎన్నికల సమయానికి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను తనవైపు తిప్పుకుంది టీడీపీ.

అయితే అప్పట్లో మండల పరిషత్ చైర్మన్ గా తాము గెలిపించుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు పరిటాల సునీతకు పడలేదట. అతడితో రాజీనామా చేయించి, ఫిరాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని ఎంపీపీగా గెలిపించుకునే యత్నం మొదలైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో లొల్లి మొదలై.. ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీ నుంచి బయటకు వచ్చారు.

ఇప్పుడు బలం కూడా వైకాపా- ఆరు మంది ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం ఐదు మంది సభ్యులతో ఉంది. కానీ.. ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం బలపరిచిన వ్యక్తి విజయం సాధించారు! అసలు ఓటింగే జరగలేదని, తెలుగుదేశం అభ్యర్థి గెలిపించినట్టుగా ప్రకటించారని.. వైకాపా నేతలు రోడ్డుకు ఎక్కారు.
 
అయినా.. ఎమ్మెల్యేలు ఫిరాయించి, అనైతక రాజకీయాలు చేస్తేనే అడిగే నాథుడు లేకుండా పోయాడు. ఈ తంతంగాన్ని అంతా చూస్తున్నా.. తెలుగుదేశం వాళ్లు నిస్సిగ్గుగా ఈ రాజకీయాలను సమర్థించుకుంటున్నారు. ఇంత చేస్తున్న చంద్రబాబు నాయుడు… తను నిప్పుని అని చెప్పుకు తిరుగుతున్నారు!
మరి అలాంటప్పుడు.. ఒక మండల పరిషత్ చైర్మన్ ఎన్నికల విషయంలో ఇలాంటి లొల్లి జరగడం, అనైతికంగా వ్యవహరించడం ఏముందిలే! గొంగలిలో తింటూ ఇక వెంట్రుకలు ఏరడం ఎందుకు?! 

Show comments