దేశంలో దొంగలు పడ్డారు

దేశంలో దొంగలు పడ్డారు.. ఔను, వీళ్ళు కొత్త దొంగలు కాదు, పాత దొంగలే. నల్ల కుబేరులే ఈ దొంగలు. దొరికేదాకా అందరూ దొరలే.. దొరికాక మాత్రమే దొంగలవుతారు. అఫ్‌కోర్స్‌, దొరికిన తర్వాత కూడా మళ్ళీ దొంగదారిలో దొరలైపోతారనుకోండి.. అది వేరే విషయం. 

పెద్ద పాత నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొంది. రోజులు గడుస్తున్నా, ఈ సంక్షోభం నుంచి దేశం బయటపడే పరిస్థితులు కన్పించకపోవడంతో, ప్రజల్లో తీవ్ర నైరాశ్యం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో సమస్యను పక్కదారి పట్టించేందుకు కేంద్రం, ఐటీ దాడుల పేరుతో సందడి చేసేస్తోంది. నిజానికి ఐటీ దాడులనేవి షరామామూలుగా జరిగే తంతు. గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి.. ఇందులో పెద్దగా వింతేమీ లేదు. 

ఐటీ దాడుల్లో దొరికే నల్లధనం ఏమవుతుంది.? అన్నది ఇపప్పటికీ, ఎప్పటికీ సామాన్యుడి కోణంలో చూస్తే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. దొరికిన సొమ్ముకి, లెక్కలు చూపించేస్తే, ఆ నల్లధనం తెల్లధనమైపోతుంది. దానికి మార్గాలు ఎటూ నల్లదొంగలకు వుంటాయనుకోండి.. అది వేరే విషయం. 

పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు తొలి ఐటీ దాడి అంటే 'బాహుబలి-2' టీమ్‌ మీదనే అనుకోవాలి. ఆ తర్వాత, హైద్రాబాద్‌లోనే ఐడిఎస్‌ కింద బాణాపురపు లక్ష్మణరావు అనే వ్యక్తి ఇళ్ళు, కార్యాలయాల్లో దాడులు జరిగాయి. అక్కడ ఐటీ శాఖ ఆశించిన రీతిలో ఏమీ దొరకలేదు. 'బాహుబలి-2' నిర్మాతలపై ఐటీ దాడి కూడా ఎందుకు జరిగిందో, అక్కడేం దొరికిందో ఎవరికీ తెలియని పరిస్థితి. 

ఇక, కర్నాటకలో మాత్రం పెద్దయెత్తున పెద్ద కొత్త నోట్లు దొరికాయి ఐటీ దాడుల్లో. దేశవ్యాప్తంగా అదే అతి పెద్ద కొత్త నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న కొత్త పెద్ద నోట్ల కట్టల 'డెన్‌' తమిళనాడులో వెలుగు చూసింది. 170 కోట్లకు పైన డబ్బు, 125 కిలోల బంగారం దొరికిందిక్కడ.. తవ్వుతున్న కొద్దీ ఇంకా నోట్ల కట్టలు వెలుగు చూస్తూనే వున్నాయి. ఇవి కాకుండా, దేశవ్యాప్తంగా ఐటీ దాడులు ముమ్మరం అయ్యాయి. 

అన్ని దాడుల్లోనూ దాదాపుగా కొత్త పెద్ద నోట్లు దొరుకుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ మొత్తమంతా దేశ ఖజానాకి వెళితే అంతకన్నా కావాల్సిందేముంది.? ఇక్కడ ఎవరైనాసరే ఆలోచించాల్సిన విషయమొక్కటుంది. రిజర్వు బ్యాంకు నుంచి ఈ నల్ల దొంగలు డబ్బుని కాజేస్తున్నారా.? లేదంటే బ్యాంకుల నుంచి తస్కరిస్తున్నారా.? అన్న విషయం తేలాల్సి వుంది. రాజకీయ అండదండలు లేకుండా, ఇంత స్వేచ్ఛగా పెద్ద కొత్త నోట్లు సంపాదించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 

అందుకే, ముందుగా ఆ రాజకీయ నల్ల దొంగల సంగతి తేలాలి. తేలుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments