అందాల కాశ్మీరం.. ఆరని రావణ కాష్టం!

దేశాభివృద్ధి కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేయడం సంగతెలా వున్నా, దేశాన్ని రక్షించుకోవడం కోసం కూడా ఆ స్థాయిలోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. తప్పదు, ఏ దేశమైనాసరే రక్షణ కోసం ఖర్చు చేయాల్సిందే. కానీ, భారతదేశానిది చిత్రమైన పరిస్థితి. కాశ్మీర్‌ అభివృద్ధికోసం చేసే ఖర్చు కన్నా, కాశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాటం కోసమే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కాశ్మీర్‌ అంతటా తీవ్రవాదం వుందని అనలేం. కానీ, కొన్ని చోట్ల వేర్పాటువాదులు, తీవ్రవాదులకు సహకరిస్తున్న తీరు కారణంగా, మొత్తం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండిపోతూ, వార్తల్లోకెక్కుతోంది. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్నదేమీ కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నదే. 'కాశ్మీ ర్‌ మాది..' అంటోంది పాకిస్తాన్‌, భారత్‌ భూభాగంలో వున్న కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఇప్పటికే పాకిస్తాన్‌ ఆక్రమించింది. చైనా ఆధీనంలోనూ భారతదేశానికి చెందిన కొంత భూభాగం వుంది. చైనా ఆక్రమిత కాశ్మీర్‌ సంగతి పక్కన పెడితే, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ తీవ్రవాదులకు ప్రధాన స్థావరంగా మారింది.

అక్కడినుంచే, భారతదేశంలోని కాశ్మీర్‌ ప్రాంతానికి తీవ్రవాదులు వచ్చి వెళుతుంటారు కొత్త అల్లుళ్ళతరహాలో. కాశ్మీర్‌లో కొందరు వేర్పాటు వాదులు, పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో, అక్కడ రావణకాష్టం అలా మండుతూనే వుంది. దశాబ్దాలుగా ఈ మారణకా ష్టం రగులుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది.? అంటే, కారణం ఒక్కటే. రాజకీయం. కాంగ్రెస్‌ హయాంలో వేర్పాటువాదులకు విపరీతమైన మద్దతు లభించింది. దాంతో, సహజంగానే అక్కడ వేర్పాటువాదం పతాకస్థాయికి చేరిపోయింది. మరిప్పుడు, గతమూడేళ్ళుగా.. బీజేపీ హయాంలో ఏం జరుగుతోంది.? అంటే, అప్పుడేం జరిగిందో.. ఇప్పుడూ అదే జరిగిందని చెప్పక తప్పదు. చిత్రంగా ఈసారి కాశ్మీర్‌లో వున్న ప్రభుత్వంలో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. బీజేపీ 'భావాలు' అందరికీ తెల్సినవే. కానీ, ఆ బీజేపీ సిద్ధాంతాలు, భావా లు.. కాశ్మీర్‌లో పనిచేయవు. అయినా, బీజేపీ గతంలో చేసిన డిమాండ్లు, నినాదాలకు తగ్గట్టు కాశ్మీర్‌పై స్పందించాల్సిన తీరులో స్పందించడంలేదు. పైగా, గతంలోకన్నా ఎక్కువగా ఇప్పుడు కాశ్మీర్‌లో తీవ్రవాదులు, వేర్పాటువాదులు సంయుక్తంగా జరుపుతున్న దాడుల్లో భద్రతాదళాలు ప్రాణాలు కోల్పోతుండడం గమనార్హం. ఎందుకిలా జరుగుతోంది.? అన్న ప్రశ్నకు సమాధానమే దొరకడంలేదు.విద్యాసంస్థల విధ్వంసం, బ్యాంకుల లూటీ వంటివి ఇటీ వలి కాలంలో సర్వసాధారణమైపోయాయక్కడ.

ప్రతిరోజూ మీడియాలో కాశ్మీర్‌కి సంబంధించిన వార్తే కన్పిస్తోంది. కాశ్మీర్‌లో కాల్పులు, పలువురు భద్రతా సిబ్బంది మృతి అనే వార్త సర్వసాధారణమైపోయింది. ఆందోళనకారుల రాళ్ళదాడి, పోలీసుల కాల్పులు అనే మాటల్నీ వింటూనే వున్నాం. వేర్పాటువాదుల సహకారంతో రెచ్చిపోతున్న తీవ్రవాదులు.. ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది.. అనే వార్తలైతే గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినాల్సి వస్తోంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మొన్నామధ్య సర్జికల్‌ స్ట్రైక్స్‌ని నిర్వహించింది భారత సైన్యం. అక్కడితో తీవ్రవాదానికి కొంతవరకు చెక్‌ పెట్టినట్లేనని అంతా భావించారు. కానీ, దురదృష్టవశాత్తూ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనేది ఓ పొలిటికల్‌ అంశంగా మారిపోయింది. బీజేపీకి పొలిటికల్‌ మైలేజీ తెచ్చిం ది. పెద్ద పాతనోట్ల రద్దు వ్యవహారమూ అంతే. తీవ్రవా దం ఆ దెబ్బకి సర్వనాశనమైపోతుందని ప్రధాని మోడీ స్వయంగా సెలవిచ్చారు. కానీ, ఏం జరుగుతోంది.? దర్జా గా తీవ్రవాదులు ఇప్పుడు బ్యాంకుల లూటీలకు పాల్పడుతున్నారు.

ఫేక్‌ కరెన్సీ కొత్త పుంతలు తొక్కడం అనేది మామూలే అయిపోయింది. చెప్పే మాటలకీ, చేస్తున్న పనులకీ, జరుగుతున్న సంఘటనలకీ అస్సలేమాత్రం పొంతన వుండడంలేదు. తాజాగా సైన్యం, 'చర్యలు చేప డుతున్నాం.. రిజల్ట్‌ త్వరలోనే తెలుస్తుంది.. ఆ చర్యలు ఏంటన్నవి ఫలితం వచ్చాకే తెలుస్తుంది..' అనే ప్రకటన చేసింది. సైన్యం చూపుతున్న తెగువని ఎవరూ తక్కువ చేసి చూపించలేరు. వారి త్యాగాలకు ఆకాశమే హద్దు. దేశమంతా సైన్యానికి మద్దతుగా నిలుస్తోంది. కానీ, అను మానాలన్నీ రాజకీయం మీదనే. సర్జికల్‌ స్ట్రైక్స్‌ని సైన్యం నిర్వహిస్తే, పబ్లిసిటీ పొందింది బీజేపీ. ఇప్పుడూ సైన్యం ప్రాణాలు కోల్పోతోంటే.. వీరావేశంతో ప్రకటనలు బీజేపీ ముఖ్య నేతల నుంచి వస్తున్నాయి. అదే సమయంలో, కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతూనే వుంది.!

లోపంఎక్కడుంది.? ఎవరిది పాపం.?ఎవరికి శాపం.? కాశ్మీర్‌ సమస్యకి పరిష్కారం కోసం దేశప్రజలంతా ఎదు రుచూస్తున్నారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కి ఎప్పుడు విముక్తి కల్పించి, భారతదేశంలో దాన్ని కలుపుతారు.? అనే ప్రశ్న సగటు భారతీయుడి గుండెని మండించేస్తోంది. దాన్ని తీసుకురావడం సంగతి తర్వాత, ముందంటూ అందాల కాశ్మీరంలో రగులుతున్న రావణకాష్టం చల్లారాలి. కానీ, అదెప్పుడు.? ఇది ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Show comments