మంచు మనోజ్‌ ఎందుకిలా చేశాడు.?

హీరో మంచు మనోజ్‌కి నటుడిగా కెరీర్‌లో చెప్పుకోదగ్గ 'బిగ్‌ సక్సెస్‌'లు లేకపోవచ్చు. కానీ, తన సినీ ప్రయాణంలో వెరైటీ చిత్రాల్ని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో మనోజ్‌ చేసిన ప్రయత్నాలు బెడిసికొడ్తున్నాగానీ, ఆ 'ప్రయత్నాలకు' ఏదో ఒక రూపంలో అభినందనలు దక్కుతున్నాయి. 

ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న మనోజ్‌, అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు ఈ రోజు. నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించాడు మనోజ్‌. 'ఒక్కడు మిగిలాడు' సినిమాతోపాటు, మరో సినిమాలో నటించనున్నాననీ, ఇవే తనకు నటుడిగా ఆఖరి చిత్రాలని మనోజ్‌ చెప్పుకొచ్చాడు. 

అయితే, సినీ పరిశ్రమకు మనోజ్‌ గుడ్‌ బై చెప్పలేదు గనుక, దర్శకుడిగా మనోజ్‌ కొత్త అవతారమెత్తుతాడనే ప్రచారం జరుగుతోంది. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా మనోజ్‌కి కమాండ్‌ వుంది. స్క్రిప్ట్‌ దగ్గర్నుంచి, యాక్షన్‌ కొరియోగ్రఫీ, డాన్సులు.. ఇలా అన్నిటిపైనా పూర్తి కమాండ్‌తో, తన సినిమాలకు సంబంధించి ఆయా విభాగాల్లో తనవంతు సలహాలు ఇస్తుంటాడు. 'వేరే ఫైట్‌ మాస్టర్‌ని పెట్టుకుంటే బడ్జెట్‌ ఎక్కువవుతుంది.. అందుకే నా సినిమాలకి ఎక్కువగా నేనే ఫైట్స్‌ కంపోజ్‌ చేసుకుంటుంటా..' అని మనోజ్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. 

ఏదిఏమైనా, విలక్షణ నటుడు మోహన్‌బాబు నట వారసుల్లో ఒకడైన మంచు మనోజ్‌, నటనకు గుడ్‌ బై చెప్పడం ఆశ్చర్యకరమే. ఇంతకీ, మనోజ్‌ ఎందుకింత సీరియస్‌ డెసిషన్‌ తీసుకున్నాడు.? అభిమానులకి థ్యాంక్స్‌ చెప్పాడు సరే, సినీ రంగంలో ఏ రూపంలో కొనసాగుతానన్నదానిపై క్లారిటీ ఎందుకివ్వలేదు.? ఏమో మరి, మనోజ్‌కే తెలియాలి.

Show comments