అమ్మకి నివాళి: మోడీ మార్క్‌ రాజకీయం.!

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన విషయం విదితమే. తమిళనాడు రాజధాని చెన్నయ్‌లోని రాజాజీ హాల్‌లో ఆమె పార్తీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం వుంచారు. ప్రధాని నరేంద్రమోడీ, చెన్నయ్‌కి చేరుకుని జయలలిత పార్టీవ దేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వున్నారు. 

జయలలితకు నివాళులర్పించిన సమయంలో అక్కడే వున్న జయలలిత సన్నిహితురాలు శశికళను ప్రత్యేకంగా ఓదార్చారు ప్రధాని నరేంద్రమోడీ. అదే సమయంలో తమిళనాడు తాజా ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కన్నీరుమున్నీరావడంతో, ఆయన్ని సైతం నరేంద్రమోడీ ఓదార్చడం గమనార్హం. ఈ క్రమంలో నరేంద్రమోడీ, కొద్ది క్షణాలపాటు శశికళతో మాట్లాడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

'నివాళి' - 'ఓదార్పు' అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, జయలలితను కడసారి దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చిన తమిళ ప్రజలకు అభివాదం (నమస్కారం చేస్తూ) చేశారు. చాలాసేపు అలా అభివాదం కొనసాగించారు నరేంద్రమోడీ. 

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటోన్న బీజేపీ, జయలలిత మృతిని వాడుకుంటోందనే విమర్శలు అప్పుడే షురూ అయ్యాయి. శశికళను తమవైపుకు తిప్పుకునే ప్రయత్లాన్ని బీజేపీ అప్పుడే ప్రారంభించిందన్న గుసగుసలు విన్పిస్తున్న వేళ, నరేంద్రమోడీ స్వయంగా శశికళను ఓదార్చడం విశేషమే మరి.

Show comments