జిల్లాలో నిర్వహణలో ఉన్న అన్ని ఇసుక రీచ్‌లో యంత్రాల వినియోగంలో ఉన్న నిషేదాన్ని పటిష్టంగా అమలుచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం మధ్యాహ్నం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు, రవాణా తదితర ప్రక్రియల్లో అక్రమాలను సహించేది లేదన్నారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక రీచ్‌లలో ఎక్కడా యంత్రాలను వినియోగించరాదన్నారు. ఈ నిషేదాన్ని అమలుచేసేందుకు మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు కృషి చేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు డివిజన్, మండల స్థాయి అధికారులను దీనిపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఇసుక రీచ్‌లు అన్నిటిలోను కచ్చితంగా ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. రీచ్‌లలో ఇసుక లోడింగ్ ప్రక్రియను ముందు వచ్చిన వారికి ముందు వడ్డన పద్దతి (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్)ని పాటించాలన్నారు. ర్యాంపుల వారీగా స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్, నిర్వహణ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని ఆయా ఆర్డీఒలు, సబ్ కలెక్టర్లకు కల్పించినట్టు చెప్పారు.
ఈ మేరకు నిర్దేశించిన ధరలు, నియమ నిబంధనలను బోర్డులపై రాయించి, రీచ్‌ల వద్ద విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ రీచ్‌లోనూ అవసరానికి మించి ఎక్కువ పరిమాణంలో ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తే సహించేది లేదన్నారు. దీనిపై నిరంతరాయంగా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
రెవెన్యూ, పోలీస్, మైనింగ్ పంచాయతీ సిబ్బంది, అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ టీములు ఇసుక రీచ్‌లపై నిఘా, పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎక్కడా అక్రమ తవ్వకాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు.