చంద్రబాబు సమర్పించు.. బ్యాలెన్స్‌ ‘షిట్‌’

రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుని 'డైల్యూట్‌' చెయ్యడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌కి 'బ్యాలెన్స్‌ షీట్‌' అని పేరు పెట్టినట్టున్నారు. టీడీపీ ఎంపీలు ఈ రోజు ఢిల్లీలో సమావేశమై, ఈ బ్యాలెన్స్‌ షీట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. 

గడచిన రెండేళ్ళలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ బ్యాలెన్స్‌ షీట్‌లో వివరిస్తారట. చాలా చేశారు, ఇంకా చెయ్యాల్సినవి వున్నాయి... ఆ వివరాల్ని 'కేవీపీ బిల్లు చర్చకు వస్తే ఆ సమయంలో వెల్లడిస్తాం.. నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదన్నది అవాస్తవం. అయినాసరే ప్రత్యేక హోదా కోసం కేవీపీ బిల్లుకి మద్దతిస్తాం. ప్రధాని హోదాలో గతంలో మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రశ్నిస్తాం.. కేంద్ర హోంమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఈ అంశాలపై స్పష్టతనివ్వాలి..' అంటూ కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి, టీడీపీ ఎంపీల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెలవిచ్చారు. 

వాస్తవానికి ఏం ఇచ్చారన్నది అప్రస్తుతం, ఏం ఇవ్వాలన్నదే ముఖ్యమిక్కడ. ఎన్‌ఐటీ అనీ, ఇంకోటనీ.. సంస్థలు నెలకొల్పడం అనేది, విభజన చట్టంలో వున్న వ్యవహారమే. కొత్తగా, విభజన చట్టంతో సంబంధం లేకుండా నరేంద్రమోడీ ప్రభుత్వం గత రెండేళ్ళలో చేసింది ఏమీ లేదు. విభజన చట్టంలోనే సెక్షన్‌-8 వుంది. అది అమల్లోకి వచ్చిందా.? రాలేదు కదా.! 

ముఖ్యమైన అంశాలంటే, పోలవరం ప్రాజెక్టు. దాంతోపాటుగా రైల్వే జోన్‌. వీటన్నిటికన్నా ముఖ్యమైనది రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించడం. వీటితోపాటు, అది ముఖ్యమైన మరో అంశం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ. రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేస్తే, ఆ ప్రకటనకు విలువ లేదని నరేంద్రమోడీ ప్రభుత్వం చెప్పదలచుకుంటే, అసలు పార్లమెంటుకే విలువ లేనట్లు. ఆ లెక్కన, పార్లమెంటులో పాస్‌ అయిన విభజన బిల్లుని ఎందుకు గౌరవించాలి.? అదొక్కటే కాదు, పార్లమెంటు చేసే చట్టాలకు ఎలాంటి నైతిక విలువలు, చట్టబద్ధతా లేవని భావించాల్సి వుంటుంది. 

ఆ విషయం పక్కన పెడితే, రాష్ట్రానికి మేలు చేసే విషయంలోనూ, తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందంటే, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? 'మా మీద ఒత్తిడి పెరుగుతోంది.. ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చాల్సిందే..' అని చంద్రబాబు, కేంద్రాన్ని డిమాండ్‌ చేయడానికి ఇంతకు మించిన తరుణం ఇంకోటి దొరకదు. ఊరికే ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో వెళ్ళి వచ్చే చంద్రబాబు, ఈ టైమ్‌లో గనుక అఖిలపక్ష సమావేశాన్ని నరేంద్రమోడీ దగ్గరకు తీసుకెళితే, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా ఆయన కంట్రోల్‌లోకే వచ్చేస్తాయి. 

కానీ, చంద్రబాబు వ్యూహాలు రాష్ట్రాన్ని బాగుచేసేందుకు కాక, బీజేపీని గండం గట్టెక్కించేందుకేనన్నట్లుగా వున్నాయి. బ్యాలెన్స్‌ షీట్‌ని తెరపైకి తీసుకురావడమంటే, నూటికి నూరుపాళ్ళూ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చడమే. ఇలాంటి జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు అండ్‌ టీమ్‌ చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.

Show comments