అరెవో సాంబా: ఏపీకి చౌదరిగారి ప్యాకేజీ

మరీ జనం అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా.? టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి రూపొందించిన ప్యాకేజీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆమోద ముద్ర వేస్తున్నారన్నమాట ఏమన్నా నమ్మదగ్గదిగా వుందా.! వినేవాళ్ళు మరీ అంత వెర్రి వెంగళప్పలనుకోవడమేంటో.. ఈ రాజకీయ పైత్యమేంటో.! ఎంత టీడీపీకి సాగిలా పడితే మాత్రం, పచ్చ మీడియా నుంచి ఇంత దారుణమైన కథనాలు, పాత్రికేయ విలువలకు పాతరేయడం కాక మరేమిటి.? 

కేంద్రం, వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనుందని పచ్చ మీడియా కథనాల్ని వండి వడ్డించేస్తోంది. ఆ ప్యాకేజీ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రానికి స్పష్టత వచ్చిందనీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ప్యాకేజీ రూపొందిందనీ, అతి త్వరలో ఆ ప్యాకేజీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించనున్నారనీ.. ఇలా ఆ కథనంలో నానా హంగామా చేసేశారు. 

నిజానికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ ఇవ్వాలనుకుంటే, ఆ విషయాన్ని స్వయంగా నరేంద్రమోడీనే ప్రకటించేవారు. గడచిన రెండేళ్ళలో అసలు ఆంద్రప్రదేశ్‌ గురించి నరేంద్రమోడీ ఆలోచించిందే లేదు. ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశ్యం ఏ కోశాన వున్నా, దాన్ని ప్రకటించడానికి అమరావతి శంకుస్థాపన వేదికను మించిన వేదిక నరేంద్రమోడీకి దొరుకుతుందా.? 

ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్‌ లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు.. అంటూ అన్నిటికీ 'కొర్రీలు' పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవలే, రాజ్యసభలో స్పష్టంగా ప్రకటించేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. పోనీ, ప్యాకేజీ సంగతి అయినా తేల్చుతారనుకుంటే, దేశంలో 29 రాష్ట్రాలున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూడలేమన్నారు. రైల్వే జోన్‌కి ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఒడిషా అభ్యంతరం ఉండనే వుందని ఆయనే సెలవిచ్చారు. 

కేంద్రం నుంచి ఇంత క్లారిటీ కనిపిస్తోంటే, టీడీపీ నేతలు కేంద్రానికి అంతలా సాగిలా పడ్తోంటే.. మధ్యలో ఈ ప్యాకేజీ వ్యవహారం ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందట. ఏదన్నా వుంటే, బీజేపీ నేతలు ముందే బాజా భజంత్రీలు షురూ చేసెయ్యరూ.! సుజనా చౌదరిగారి ప్యాకేజీ.. అంటూ ప్రచారం చేస్తున్నారు సరే, ఆయనేమన్నా తన జేబులోంచి డబ్బులు తీసిస్తారా.? కామెడీ కాకపోతే.!

Show comments