తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచుగా తమ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని చెబుతుంటారు. కుప్పలుతెప్పలుగా పెట్టుబడులు వస్తున్నాయని, విదేశీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయని గొప్పలకు పోతుంటారు. కాని ఎన్నికల్లోనూ, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు ఏమైపోయాయని, ఎందుకు నెరవేర్చడంలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే రాత్రికి రాత్రి అన్నీ అయిపోతాయా? ఇదంతా గత ప్రభుత్వాల నిర్వాకమేనని మండిపడుతుంటారు. ఏవేవో కాకమ్మ కబుర్లు చెబుతుంటారు. రెండు రాష్ట్రాల్లో పరిపాలనా కాలం సగం ముగిసినా ప్రారంభంలో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు.
దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ పాలకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హామీలు ఇచ్చేటప్పుడు వెనకాముందు ఆలోచించకుండా బుర్రకు ఏం తోస్తే ఆ వాగ్దానం చేస్తుంటారు. నెరవేర్చమనేసరికి 'కతలు' చెబుతుంటారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హామీల అమలులో లేని వేగం, ఆరాటం నగదురహిత రాష్ట్రాలుగా మార్చడంలో విపరీతంగా కనబడుతోంది. ఇద్దరు 'చంద్రులు' కిందామీదా నిలవడంలేదు. గతంలో పుష్కరాలప్పుడు నదుల్లో మునక్కపోతే పుణ్యం రాదని, తప్పనిసరిగా స్నానాలు చేయాల్సిందేనని ప్రచారం చేసిన ముఖ్యమంత్రులు ఇప్పుడు నగదురహిత లావాదేవీలు నిర్వహించకపోతే ఎందుకూ పనికిరాని సన్నాసుల్లా అయిపోతారన్నట్లుగా ఊదరగొడుతున్నారు.
హామీల గురించి అడిగితే రాత్రికి రాత్రి అన్ని పనులు అయిపోతాయా అని విసుక్కునే పాలకులు తమ రాష్ట్రాలు రాత్రికి రాత్రి కాకపోయినా కొత్త ఏడాది కళ్లు తెరిచేనాటికి క్యాష్‌లెస్ అయిపోవాలని, ఆ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటపడిపోతున్నారు. వందశాతం నగదురహిత లావాదేవీలు జరిపే స్థితికి చేరిన తొలి గ్రామానికి పది లక్షలు, రెండో స్థానంలోని గ్రామానికి ఐదు లక్షలు బహుమతిగా ఇస్తామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సిద్దిపేటను దేశంలోనే నగదురహిత నియోజకవర్గంగా మారుస్తామన్నారు. క్యాష్‌లెస్ వల్ల అవినీతి పోతుందని, ధరలు తగ్గుతాయని చెప్పారు.
కొత్త ఏడాదికి కొత్త మార్పుతో స్వాగతం పలకాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డిసెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరగాలన్నారు. క్యాష్‌లెస్ ప్రోత్సాహాల కోసం వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంమీద క్యాష్‌లెస్ విషయంలో రెండు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. అయితే క్యాష్‌లెస్ లావాదేవీలపై బ్యాకింగ్ నిపుణులు 'ఇదంత వీజీ వ్యవహారం కాదు' అంటున్నారు. అన్ని స్థాయిల్లో క్యాష్‌లెస్ లావాదేవీలు చేయాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని, ముఖ్యంగా చిన్న వ్యాపారుల విషయంలో మాటలు చెబుతున్నంత సులభం కాదని అంటున్నారు. పూర్తిగా క్యాష్‌లెస్ కావాలంటే 15 ఏళ్లు పడుతుందని నిపుణులు తేల్చిచెప్పారు.
క్యాష్‌లెస్ లావాదేవీలపై నాయకులు టిఫినో, అన్నమో తిన్నంత సులభమని ప్రచారం చేస్తున్నారు. కాని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం చూస్తే ఆషామాషీ వ్యవహారం కాదనిపిస్తోంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం వ్యాపారులు బ్యాంకులో తప్పనిసరిగా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో నెలకు కనీసం 50 వేలకు తక్కువ కాకుండా లావాదేవీలు జరిగినట్లు ఉండాలి. సంస్థ రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్, సంస్థకు సంబంధించిన ఫొటోలు సమర్పించాలి. స్వైప్ మిషన్లు ఉండగానే సరిపోదు. అనేక లాంఛనాలు పూర్తి చేయాల్సివుంటుంది. పాస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలు వేగంగా పనిచేసేలా ఉండటమే కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
వ్యాపారులు ఈ యంత్రాలకు నెలవారీ ఛార్జీలు లేదా నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి. చిల్లర వ్యాపారం చేసేవారికి వీసా, మాస్టర్ కార్డులు లేకుంటే మాల్‌ప్రాక్టీస్ జాబితాలో పెడతారు. నెలకు యాభై వేల వరకు ఈ కార్డుల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. వ్యాపారులకు తప్పనిసరిగా ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ ఉండాలి. ఇంకొన్ని నిబంధనలు కూడా ఉండొచ్చు. ఇన్ని నిబంధనలు పూర్తి చేయాలని క్యాష్‌లెస్ మీద ప్రచారం చేస్తున్న నాయకులకు తెలియకపోవచ్చు.
గల్లీల్లో, కాలనీల్లో చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకునే బడుగు జీవులు నెలకు యాభైవేల లావాదేవీలు జరపగలడా? ఇంటర్నెటు, టెలిఫోన్, కార్డులు వగైరా అవసరమా? ఇవన్నీ పెట్టుకుంటే అతనికేం మిగులుతుంది? పాలకుల వైఖరి చూస్తుంటే క్యాష్‌లెస్‌ను నిర్బంధం చేస్తారనిపిస్తోంది.