బయ్యర్లని నష్టపరిచిన డిజె - దువ్వాడ జగన్నాథమ్ చిత్రం వల్ల దిల్ రాజుకి నిర్మాతగా ఎలాంటి నష్టం రాలేదు. కానీ ఆ చిత్రానికి వచ్చిన కలక్షన్లకి మించిన వసూళ్లు ప్రకటించడం, హిట్ కాకపోయినప్పటికీ బ్లాక్‌బస్టర్ అని చెప్పుకోవడంతో అతడి ఇమేజ్‌కి కాస్త నష్టం వాటిల్లింది.
క్లీన్ అండ్ కాంట్రవర్సీ లేని హిట్లు సాధించే దిల్ రాజు తన ఇరవై అయిదవ చిత్రాన్ని విజయంగా చూపించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. దీని వల్ల మీడియాలో చాలా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అయ్యాడు. అయితే డిజె చేసిన నష్టాన్ని వెంటనే భర్తీ చేస్తూ 'ఫిదా' వచ్చింది. అనూహ్యమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రాజుకి లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఫ్లాప్స్‌లో వున్న శేఖర్ కమ్ముల చెప్పిన కథని నమ్మి, అతడికి పూర్తి స్వేఛ్ఛనిచ్చి దిల్ రాజు ఫిదాకి వెన్నుదన్నుగా నిలవడంతో నిర్మాతగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప సినిమాలని అందించే దిల్ రాజు డీజే లాంటి చిత్రాలని వెనకేసుకు రావాల్సిన పని లేదు. సంవత్సరానికి ఎన్నో సినిమాలు తీస్తున్నపుడు ఒకటి, రెండూ అటు, ఇటు అయితే దానిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.