మహానాడులో యువ నాయకత్వం

తెలుగుదేశం పార్టీ మూడవ తరం నాయకత్వం ముందుకొచ్చింది. 36వ మహానాడును పూర్తిగా తెలుగుదేశం నాయకుల వారసులు తమ భుజాలపై వేసుకుని నడిపించారు. శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు మహానాడు సభా అధ్యక్ష బాధ్యతలను నిర్వహించగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తనయుడు మల్లిక్‌, అదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ కుమార్తె శిరీష.

విశాఖ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్‌, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అల్లుడు శ్రావణ్‌ ఈసారి మహానాడులో కీలకమైన భూమిక పోషించారు. వీరితో పాటుగా, కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌, దేవినేని బాజీ కుమారుడు చంద్‌, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌, రాజమండ్రి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు వాసు తదితరులంతా మహానాడులో కలియదిరుగుతూ యువతరానికి ప్రతినిధులుగా వ్యవహరించారు.

వీరంతా నారా లోకేష్‌ సూచనల మేరకు పనిచేస్తూండడం విశేషం. వీరిని చూసిన తెలుగుదేశం సీనియర్లు మా తరం ఇక రిటైరైపోవచ్చు. మూడవ తరం ప్రవేశించి తన సత్తా చాటుతోందంటూ చమత్కరించడం గమనార్హం. చంద్రబాబు సైతం యువతరం రాజకీయాలలోకి రావాలన్నదే తన ఉద్దేశ్యమని, అందుకే నాయకుల వారసులను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్‌ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి అయితే ఆయన అల్లుడు చంద్రబాబు మాత్రం వారసత్వాలనే నమ్ముకోవడం ఆ పార్టీ వాస్తవ రాజకీయాలకు దర్ఫణంపడుతోంది.

Show comments