కాలు తొక్కే రోజే కాపురం చేసే కళ తెలుస్తుందని అంటారు.. ముందు ముందు నారా లోకేష్ బాబు అసెంబ్లీలో ఎలా వ్యవహరించబోతున్నాడనే అంశం గురించి ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే క్లారిటీ వచ్చేసింది. మరీ రాసింది చదవలేకపోవడం ఏమిటి? లోకేష్ ఒట్టి ఎమ్మెల్సీ కాదు.. మంత్రి పదవి కూడా తీసుకోబోతున్నాడు. రేపో మాపో ప్రమాణ స్వీకారం.
మరి ఈ పాటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అభిమానుల్లో అలజడి మొదలైంది. ఇతనేంట్రా బాబూ.. మరీ ఇలా అనుకుంటున్నారు తమ్ముళ్లు. వీర భక్తులను పక్కన పెడితే.. సగటు తెలుగుదేశం అభిమానుల గుండెల్లో మాత్రం లోకేష్ గుబులుపుట్టిస్తున్నాడు. లోకేష్ పార్టీకి బలంగా మారడం సంగతి అటుంచితే.. వీక్ నెస్ గా మారుతున్నాడేమో అనే భయం తెలుగుదేశం వాళ్ల నుంచే స్పష్టంగా వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే లోకేష్ బాబు చాలాసార్లు నోరు జారారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే.. ఉరేసుకున్నట్టే, అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి.. ఇవన్నీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే.. అని లోకేష్ బాబు వదిలిన చణుకులు ప్రత్యర్థులకు ఆయుధాలై కూర్చున్నాయి. మొన్నామధ్య తమ నడమంత్రపు మీడియా మోతుబరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు పోటీ.. జగన్, కేటీఆర్ లతో కాదు చంద్రబాబుతోనే అని లోకేష్ మరో బాంబు పేల్చాడు.
అవును.. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జగన్, కేటీఆర్ లతో నీలాంటి నామినేటెడ్ కు పోటీ ఏముందిలే? అని ప్రత్యర్థులు సెటైర్ వేయగా, చంద్రబాబుతోనే పోటీ అని చెప్పడం ద్వారా బాబును దించి పదవిని అధిష్టించాలని లోకేష్ ట్రయ్ చేస్తున్నాడనే లాజిక్ కూడా లోకేష్ మాటల నుంచే వ్యక్తం అయ్యింది. ఇక ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే లోకేష్ మరో వీడియో సెటైర్ ప్రత్యర్థుల చేతిలో పెట్టాడు.
దీంతో తెలుగుదేశం నేతల గుండెలు ఝల్లుమంటున్నాయి. ముందు ముందు లోకేష్ బాబు మంత్రిగా ఏమేం మాట్లాడతాడో.. అవి పార్టీ పరువును ఏ స్థాయికి తీసుకెళతాయో అనే భయం చాలా స్పష్టంగానే వ్యక్తం అవుతోంది తమ్ముళ్ల నుంచి!