నాగబాబూ.. ఇది మీకు తగునా.?

ఆయన తెలుగు సినిమా దర్శకుడే. బాలీవుడ్‌కి వెళ్ళాడు. ఇప్పుడు సక్సెస్‌లు సరిగ్గా లేవు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటాడు. ఎక్కువగా మెగా బ్రదర్స్‌ మీద కామెంట్లు వేస్తుంటాడు. అంతే, ఓ దర్శకుడి మీద మెగా బ్రదర్‌ నాగబాబుకి కోపమొచ్చింది. ఆ కోపాన్ని తీర్చుకునేందుకు 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఆడియో విడుదల వేడుకను వేదికగా మార్చుకున్నారు. 

'వాడు.. వీడు.. అక్కుపక్షి.. కుసంస్కారి..' అంటూ నాగబాబు, సదరు దర్శకుడి మీద ఆవేశంతో ఊగిపోయేసరికి, అభిమానులే షాక్‌కి గురయ్యారు. 'మేం కష్టపడి వచ్చిన వాళ్ళం.. మీలాంటోళ్ళని లెక్క చేయం..' అని నాగబాబు చెప్పడం బాగానే వుందిగానీ, లెక్కచేయనప్పుడు ఇంత ఘాటుగా స్పందించడమెందుకట.? అదే మరి.! 

ఇలాంటి వేదికలపైనుంచి ఘాటైన వ్యాఖ్యలు చేయడం, అదీ సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి మీద.. ఎందుకట.? ఇంతదాకా వచ్చినాక, అతను ఫలానా దర్శకుడని పేరు చెప్పేస్తే బాగుండేది. ఇంకో, 'రచయిత' మీద కూడా నాగబాబు మండిపడ్డారు. 'వ్యక్తిత్వం మీద పుస్తకాలు రాస్తాడు' అంటూ హింట్‌ ఇచ్చేసి, అతనికి అర్థమవుతుంది.. అని ముక్తాయింపునిచ్చారు నాగబాబు. 

రీమేక్‌లు తీస్తే తప్పేంటి.? అని మొదలెట్టిన నాగబాబు, ఎవర్ని కడిగేయాలనుకున్నారో వారిని కడిగేశారు. అభిమానులూ అక్కడికక్కడ హ్యాపీ ఫీలయి వుండొచ్చుగాక. కానీ, డైరెక్ట్‌గా ప్రెస్‌ మీట్‌ పెట్టి కడిగేయాల్సిన నాగబాబు, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఆడియో వేడుకని వివాదాలకి వేదికగా మార్చుకోవడం ఎంతవరకు సబబో ఏమో.! ఆ డైరెక్టరెవరో మీకందరికీ తెలుసు కదా.!

Show comments