13 ఏళ్ళ తర్వాత ఆ సీక్వెల్‌లో త్రిష

విక్రమ్‌, త్రిష జంటగా దాదాపు 13 ఏళ్ళ క్రితం 'సామి' అనే సినిమా వచ్చింది. హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. తాజాగా, ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఆసక్తికరమైన విషయమేంటంటే, సీక్వెల్‌లోనూ త్రిష, విక్రమ్‌ కలిసి నటిస్తుండడం. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ప్రకటించింది. 

నిజానికి, గతంలోనే 'సామి' సీక్వెల్‌ కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ ప్రయత్నాలు ఇన్నాళ్ళకు ఓ కొలిక్కి వచ్చాయి. విక్రమ్‌తో కలిసి మళ్ళీ నటిస్తుండడం చాలా ఆనందంగా వుందనీ, ’సామి‘ సీక్వెల్‌ కోసం దర్శకుడు హరి తనను ఎంపిక చేయడం ఇంకా ఆనందంగా వుందంటూ త్రిష చెప్పుకొచ్చింది. 

అన్నట్టు 'సామి' తెలుగులోకి కూడా రీమేక్‌ అయ్యింది. తెలుగులో బాలకృష్ణ, అసిన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీనరసింహ', 'సామి'కి రీమేక్‌. తెలుగులోనూ అప్పట్లో 'లక్ష్మీనరసింహ'కి సీక్వెల్‌ చేయాలనుకున్నారు బాలకృష్ణ. అదీ కుదరలేదు. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకు 'సామి' సీక్వెల్‌ పట్టాలెక్కుతుండడంతో, ముందుముందు తెలుగులోనూ 'లక్ష్మీనరసింహ' సీక్వెల్‌కి బాలయ్య రెడీ అయిపోవచ్చేమో.!

Readmore!
Show comments