పేటీఎం - పే టు మోడీ: పంచ్‌ అదిరింది

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పంచ్‌లు వేస్తారా.? వేస్తారు, కావాలంటే ఈ పంచ్‌ చూడండి. పేటీఎం అంటే 'పే టు మోడీ' అట. ఇప్పటిదాకా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదు. బహుశా, నరేంద్రమోడీ రాజకీయ జీవితంలో ఇదే తొలి అవినీతి ఆరోపణ కావొచ్చు. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ 'వ్యాపారం' పుంజుకుంది. అందులో 'పేటీఎం' కూడా ఒకటి. 'పేటీఎం కరో..' అంటూ యాడ్స్‌ చాలాకాలంగా దంచేస్తున్నాయి. 

చిత్రంగా, పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత, ఎంపిక చేయబడ్డ కొన్ని 'ఆన్‌లైన్‌' సంస్థలు లాభపడ్డాయనే విమర్శలు విన్పిస్తోన్న వేళ, 'పేటీఎం - పే టు మోడీ' అంటూ రాహుల్‌ చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుండడం అతిశయోక్తి ఏమాత్రం కాబోదు. 

తన తల్లిని కూడా బ్యాంకు క్యూ లైన్లలో నిలబెట్టిన నరేంద్రమోడీ, ఎందుకు అంబానీ, అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తల్ని బ్యాంకుల ముందు నిలబెట్టడంలేదు.? అన్న ప్రశ్నకి బీజేపీ నేతలు ఇప్పటిదాకా సమాధానం చెప్పడంలేదు. 30 రోజులు దాటింది పెద్ద పాత నోట్లు రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చి. అప్పటినుంచీ ఇప్పటిదాకా, క్యూ లైన్లలో 100 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 

అన్నట్టు, క్యూ లైన్లలో ఓపిగ్గా నిల్చుంటున్నవారికి ప్రధాని నరేంద్రమోడీ సోషల్‌ మీడియా ద్వారా తాజాగా 'హేట్సాఫ్‌' చెప్పేశారండోయ్‌. పనిలో పనిగా, చనిపోయినవారికీ సంతాపం ప్రకటించి వుంటే బావుండేదేమో.! ఇంకా నయ్యం, అదే చేస్తే.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఫ్లాప్‌ షో అనే విషయం ఫోకస్‌ అయిపోదూ.? పైగా, అక్కడున్నదెవరు.. నరేంద్రమోడీ.. పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. 

ఏదిఏమైనా, పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత 'పేటీఎం' మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా అనేక సంస్థలపై ఆరోపణలు మామూలే. ప్రధానంగా పేటీఎం యూజర్స్‌ తాలూకు వ్యక్తిగత డేటా పెద్దయెత్తున 'తస్కరణ'కు గురయ్యిందనే వాదనలూ లేకపోలేదు. బ్లాక్‌ మనీ 'పేటీఎం' లోకీ బాగానే కన్వర్ట్‌ అయ్యిందనే ఆరోపణల సంగతీ సరే సరి. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే.. సామాన్యుడి నడ్డివిరిచిన నరేంద్రమోడీ, 'పేటీఎం'ని మాత్రం బాగానే ఉద్ధరించేశారన్నమాట. ఇంతకీ, పేటీఎం - పే టు మోడీ.. నిజమేనా.?

Show comments