భూమా మరణం- సంతాపంలో రాజకీయ వివాదం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంపై ఏపీ శాసనసభ సంతాప తీర్మానం పెట్టినప్పుడు విపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వెళ్లలేదన్న వార్త వినగానే మొదట ఆశ్చర్యం కలిగించింది. ఇలా చేయవచ్చా అనిపించింది. కాని ఆ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్‌ చెప్పిన కారణం, ఆ పార్టీ వారు చేసిన వాదన విన్న తర్వాత ఎంత దూరంగా ఆలోచించారనిపించింది. అంతేకాదు.. చనిపోయిన వ్యక్తిపట్ల గౌరవంగా ఉండడం కోసం జగన్‌ కాని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కాని తమను ఒకమాట అన్నా ఫర్వాలేదులే అనుకున్న తీరు మానవత్వానికే నిదర్శనం అని చెప్పాలి. భూమా నాగిరెడ్డి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత నాటకీయంగా మాట్లాడారు. రాజకీయాలలో ఎంత కపటంగా ఉండవచ్చో ఏపీ శాసనసభలో టీడీపీ నేతలు నిరూపించారంటే అతిశయోక్తి కాదు.

వారికి ఎంత రాజకీయం వంట పట్టకపోతే, స్వయానా నాగిరెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను అంత్యక్రియలు పూర్తి అయి, కాకముందే సమావేశాలకు తీసుకు వచ్చారు! ఏపీ అసెంబ్లీలో మాట్లాడించారు. అలాగే నాగిరెడ్డి బావమరిది ఎస్‌వి.మోహన్‌ రెడ్డితో కూడా అదే మాదిరి శాసనసభలో మాట్లాడించారు. గతంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు శాసనసభలో పరస్పరం ఆరోపణలు చేసుకుని అసలు విషయం పోయి రాజకీయ వివాదమే ప్రముఖంగా చోటుచేసుకున్న సందర్బాలు ఉన్నాయి. వంగవీటి రంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ దీక్ష చేస్తుండగా హత్యకు గురయ్యారు. అసెంబ్లీలో ఆయనకు సంతాప తీర్మానం పెట్టినప్పుడు ఎంత గందరగోళం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అలాగే టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డి హత్యకు గురైనప్పుడు ఆనాటి మంత్రి మైసూరారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ చేయడం పెద్ద వివాదం అయింది. పెనుకొండకు ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌.చెన్నారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే  పరిటాల రవీంద్రలు కూడా హత్యలకు గురైనప్పుడు పరస్పర ఆరోపణలు పెద్దఎత్తున జరిగాయి.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ మరణించినప్పుడు తెలుగుదేశంలోని ఆయన వర్గం నేతలు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏకంగా చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించాయి. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం మరణించిన భూమా నాగిరెడ్డికి అలాంటి పరిస్థితి రాకుండా, సంతాప తీర్మానం వివాదం కాకుండా జగన్‌ తప్పించినా, తెలుగుదేశం పార్టీ దీనిని రాజకీయం చేసి, హిందూ సంస్కతి అని, సంతాప తీర్మానానికి విపక్షం రాదా ఎంతకు సంస్కారం అంటూ ఎక్కడలేని రాగాలు ఆలపించిండం ద్వారా వారి అసలు సంస్కారం బయటపెట్టుకున్నారు. వారికి బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు కూడా వంతపాడడం ద్వారా తెలివితక్కువగా వ్యవహరించారు. ఆయనకు టీడీపీ చేసిన ఫిరాయింపుల దిక్కుమాలిన రాజకీయం గురించి పట్టకపోవడం చిత్రంగానే ఉంటుంది. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డి, ఎస్‌వి.మోహన్‌ రెడ్డి ఒక కుటుంబానికి చెందినవారే అయినా జగన్‌ మూడు టిక్కెట్లు ఇచ్చారు. భూమా ప్రత్యర్దులు శిల్పా సోదరులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్దమైతే కేవలం భూమా కోసం జగన్‌ వారిని వదలుకున్నారు.

ఆ తర్వాత శోభ అనూహ్యంగా ప్రమాదంలో మరణించడంతో వారి కుమార్తె అఖిలప్రియకు టిక్కెట్‌ ఇచ్చారు. నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. అదే సమయంలో ఒకప్పుడు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అన్న సంగతి కూడా చూడకుండా చంద్రబాబు ప్రభుత్వం భూమాపై రౌడీషీట్‌ పెట్టింది. ఎస్‌సీ అత్యాచార కేసు పెట్టింది. జైలులో ఉంచింది. బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. చివరికి భూమా తన కూతురితో సహా టీడీపీలో చేరేవరకు వేదించారు. అంతేకాక మంత్రిపదవి ఇస్తామని ఆశ చూపారు. వీళ్లు నమ్మి టీడీపీలో చేరారు. మంత్రిపదవి రాలేదు సరికదా.. శిల్ప గ్రూప్‌తో నిత్యం తగాదాల టెన్షన్‌ ఏర్పడింది. చంద్రబాబు ఎప్పుడు మంత్రిపదవి ఇస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఆ క్రమంలోనే కర్నూలు జిల్లాలో టీడీపీకి బలంలేకపోయినా, మళ్లీ చంద్రబాబు కౌన్సిల్‌ ఎన్నిక బేరసారాలు మొదలు పెట్టించారు. ఆ ఎన్నికలో గెలిపించాలని భూమాతో గట్టిగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. స్వయంగా భూమానే ఈ వివాదాల మద్యలో అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను వదలి పరువు పోగొట్టుకుని, ఇటు చంద్రబాబు హెచ్చరికలు, మంత్రిపదవి ఇవ్వకుండా టెన్షన్‌ పెట్టడంతో రెండిటికి చెడ్డ రేవడి అయ్యానని విజయవాడలో ఆయన బందువుల వద్ద మానసిక క్షోభతో ఆవేదన వ్యక్తం చేశారని సీపీఐ నేత ఒకరు టీవీలలోనే చెప్పారు.

ఇదంతా ప్రచారం అయితే టీడీపీకి డ్యామేజ్‌ కనుక చంద్రబాబు నాయుడు అత్యంత డ్రమటిక్‌గా తనకు, భూమా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పిక్చర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు నిజంగానే  ఇందులో రాజకీయం చేయదలిచి ఉండకపోతే అసెంబ్లీలో మంత్రులు, కొందరు ఎమ్మల్యేలు నోటికి వచ్చినట్లు జగన్‌ను, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను విమర్శిస్తుంటే ఆపి ఉండాల్సింది. అలా చేయకపోగా, తాను కూడా రాయి వేయకపోతే ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా ఆయన కూడా జగన్‌ను విమర్శించారు. అందుకే జగన్‌కు కోసం వచ్చినట్లుంది. ఒక్క మాటలో తెల్చేశారు. చంద్రబాబు నక్క రాజకీయాలు చేస్తారని, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా తమ మద్య ఉందని తేల్చేశారు. నిజమే.. రాజకీయాలలో అబద్దాలు చెప్పు, మోసాలు  చేయి.. ప్రతి సందర్భంలోను మంచి, చెడుతో నిమిత్తం లేకుండా రాజకీయం చేయి.. ఏమైనా కాని ప్రజలను మాయ చేసి గెలవాలనుకున్న మనస్తత్వం తనదని భూమా సంతాప తీర్మానం చర్చలో చంద్రబాబు రుజువు చేస్తే, తనకు దూరమైనా, మరణించిన తర్వాత భూమాకు సభలో అగౌరవం కలగరాదని భావించి మానవత్వంతో వ్యవహరించానని జగన్‌ రుజువు చేసుకున్నారు. రెండుపక్షాల వాదన విన్న తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఈ సంతాప తీర్మాన సమయంలో సభలో లేకపోవడమే సరైననిర్ణయం అన్న అభిప్రాయం కలిగింది. కాకపోతే అధికార టీడీపీ మాత్రం భూమా సంతాప సభను సైతం రాజకీయ ప్రత్యర్దులపై తట్టెడు బురదచల్లేయత్నం చేసి తన కుట్ర స్వభావాన్ని మరోసారి రుజువు చేసుకుందని చెప్పాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments