గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాజకీయాల్లో హుందాతనానికి కేరాఫ్ అడ్రస్.. ఈ సర్టిఫికెట్ ఇచ్చిందెవరో కాదు, సాక్షాత్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 'సాక్షి' మీడియా. ఔను, నిజం. నమ్మి తీరాల్సిందే. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిగారికి సాక్షి సర్టిఫికెట్ ఇవ్వడమంటే ఆశ్చర్యకరమే. ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చిందో తెలుసా.? మంత్రి పదవి దక్కకపోవడంతో అలకపాన్పు ఎక్కిన గోరంట్ల, చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా దుమ్మెత్తి పోశారు గనుక.!
ఇదే సాక్షి మీడియా, గతంలో రాజమండ్రి నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగడాలపై పుంఖాను పుంఖాలుగా కథనాల్ని తెరపైకి తెచ్చింది. 'గోరంట్ల అనుచరుల రౌడీయిజం.. తెలుగు తమ్ముళ్ళ దాష్టీకం..' అంటూ సాక్షి మీడియాలో గోరంట్లపై వచ్చిన కథనాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు, అసెంబ్లీలో జగన్‌పై గోరంట్ల విమర్శలు చేసినప్పుడూ, రోజాపై ఆయన నోరు పారేసుకున్నప్పుడూ, రాజకీయాలంటేనే రోత పుట్టేలా గోరంట్ల వైఖరి.. అని దుమ్మెత్తి పోసింది సాక్షి మీడియా.
ఏం చేసినా, గోరంట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశమైతే లేదు. ప్రస్తుతానికి చంద్రబాబుని విమర్శించారు గనుక, గోరంట్లకు సాక్షి మీడియాలో చోటు దక్కుతోంది. గోరంట్ల, బొండా ఉమ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. ఇలా చాలామంది మంత్రిపదవుల విషయంలో అసహనం వ్యక్తం చేశారు. దాదాపుగా వారంతా దార్లోకొచ్చేశారు. గోరంట్ల కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సాక్షి తనమీద సానుకూలంగా కథనాల్ని ప్రసారం చేస్తోంది కాబట్టి, ఆయన ముందు ముందు సాక్షిపై, వైఎస్సార్సీపీపైనా విమర్శలు చేయకుండా జాగ్రత్త పడరు కదా.! అధినేత చంద్రబాబు చెప్పిందే వేదం.!
అదే సమయంలో, టీడీపీకి మళ్ళీ 'లాయలిస్ట్‌గా' గోరంట్ల మారిపోతే, అప్పుడు సాక్షిలో మళ్లీ గోరంట్ల రాజకీయ హుందాతనంపై సరికొత్త కథనాలు, ఇంకో పంథాలో దర్శనమివ్వడం ఖాయం.