వైఎస్‌ జగన్‌.. మారిన మనిషి.!

వైఎస్‌ జగన్‌ మారిన మనిషి.. అవును, ఇప్పుడాయన చాలావరకు మారిపోయారు. ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యాక, జగన్‌లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది. ప్రత్యేక హోదా విషయంలో తప్ప, బీజేపీతో తమకు ఎక్కడా వైరం లేదని తేల్చేశారు. ఎన్డీయేకి అంశాల వారీగా మద్దతిస్తామనీ, అలాగే అంశాలవారీగా విభేదిస్తుండడం కూడా జరుగుతుందని జగన్‌ చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన సందర్భమే ఇది. 

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీకి మద్దతిస్తున్నట్లు జగన్‌ పేర్కొనడంతో అంతా షాక్‌కి గురయ్యారు. 'ఓడిపోతామని తెలిసీ, బీజేపీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం ఎంతవరకు సబబు.?' అంటూ జగన్‌ వింత వాదనను తెరపైకి తెచ్చారు. రాజకీయ పార్టీలన్నాక కొన్ని లెక్కలుంటాయి. ఒక్కోసారి ఓడిపోతామని తెలిసినా అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తుంది. బలం వున్నా, గెలవలేని పరిస్థితులుంటాయని వైఎస్‌ జగన్‌కి సైతం తెలియనిదేమీ కాదు. అసెంబ్లీలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం గెలిచేస్తామని పెట్టిందేనా.? కాదు కదా.! 

సరే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం అవసరమన్న జగన్‌ వాదనను కొట్టి పారేయలేం. అలాగని, ఆ పేరు చెప్పి, ఎన్డీయేకి మద్దతిస్తామనడమంటే, తద్వారా తెలుగుదేశం పార్టీకి కూడా జగన్‌ మద్దతిస్తున్నట్లే భావించాలి. ఎందుకంటే, ఎన్డీయేలో టీడీపీ కూడా భాగం కాబట్టి.! ఇంతకీ, ఢిల్లీలో మోడీ - జగన్‌ భేటీలో జరిగిన 'మాయ' ఏంటి.? జగన్‌ ఎందుకిలా మారిపోయారు.? ఇదే ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతల్నీ షాక్‌కి గురిచేస్తోంది. 

అన్నట్టు, ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే ప్రభుత్వంతో, బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించడం మరో విశేషమిక్కడ. మోడీ దగ్గర అమీ తుమీ తేల్చుకోవాల్సింది పోయి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తాం.. మిగతా విషయాల్లో పోరాటం చేస్తాం.. అనడంలో జగన్‌ ఆంతర్యం ఏమిటట.? 

Show comments