తెలంగాణకు సీఎంనవుతా అంటున్న రెడ్డిగారు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే .. తనే సీఎం అవుతానని అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో సీఎం అభ్యర్థిత్వం గురించి చర్చ ఎంత ప్రహసనంగా ఉంటుందో వేరే వివరించనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. పార్టీ ఉనికి కోసం పోరాడుతున్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే అని కోమటి రెడ్డి ప్రకటించుకోవడం ఆసక్తికరంగా ఉంది.

కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే! ప్రస్తుత తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే… కనీసం ఇరవై మంది తాము సీఎం పదవికి అర్హులమే అనే వాళ్లు కనిపిస్తారు. సీఎం అభ్యర్థిత్వం గురించి వారి వారి అర్హతలు, వారి వారి సమీకరణాలు, వారి వారి లాజిక్కులు వారికున్నాయి.

అయితే ఇలాంటి సీఎం అభ్యర్థుల్లో కొందరికి కనీసం ఎమ్మెల్యేగా గెలవడం చేతకాలేదు! భవిష్యత్తులో కూడా వారు గెలవలేరు.. కానీ సీఎం పదవికి మాత్రం తాము అర్హులమే అని వాళ్లు స్పష్టం చేస్తారు. తమ అర్హతల గురించి చెప్పమంటే, తమకు మించిన అర్హులు లేరని కూడా వారు అంటారు. 

ఇలాంటి నేపథ్యంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి వస్తే తనే సీఎం అన్నాడు. మరి ముందు పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని ఈయన గ్రహిస్తే మేలేమో! ఉనికి పాట్లు పడుతున్న చోట, ఉన్న ఎమ్మెల్యేలు ఫిరాయించిన వేళ, జనాకర్షక నేత ఎవరూ లేకుండా పోయిన చోట.. పార్టీ అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు. కాంగ్రెస్ నేతలు ముందుగా.. అందుకోసం పని చేసి, తర్వాత సీఎం అభ్యర్థిత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది.

అయిన ఇక చూడాలి…కోమటిరెడ్డికి ఎంతమంది కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తారో. నువ్వు కాదు.. సీఎం అభ్యర్థులం మేము.. అని చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈయనపై విరుచుకుపడే అవకాశం ఉంది.

Show comments