గరగపర్రుపై పవన్‌ మౌనం వెనకాల..

ప్రశ్నించడం కోసం జనసేన పార్టీ స్థాపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అనేక సందర్భాల్లో తనలో ఉత్పన్నమైన ప్రశ్నలకు తనకు తానే సమాధానపరుచుకుని మౌనం పాటిస్తుంటాడు. ఇప్పటి వరకూ అడిగిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడం కూడా పవన్‌ ప్రశ్నలు అడగడం తగ్గించడానికి ఒక కారణం. 

అందుకనే రాష్ట్రంలో ఏం జరుగుతున్నా తనకు పట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు. విశాఖ భూకుంభకోణాలు, చాపరాయి గిరిజన మరణాలు పవన్‌ ప్రశ్నల జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయాయి. చివరికి తన సొంతజిల్లా పశ్చిమ గోదావరిలో తను పుట్టిపెరిగిన ఊరు మొగళ్తూరుకు కూతవేటు దూరంలోని గరగపర్రులో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన దురాగతంపై కూడా నోరుమెదలేని దీనస్థితిలో ప్రస్తుతం పవర్‌స్టార్‌ కొట్టుమిట్టాడుతున్నాడు.

దళితుల సాంఘిక బహిష్కరణ జరిగిన గరగపర్రు భీమవరం పక్కనే ఉంది. చిరంజీవి సొంతఊరు మొగళ్తూరు ఇక్కడికి చాలా సమీపంలో ఉంది. నిత్యం మహాత్ముని ఆదర్శ భావాలు, కమ్యూనిస్టు సమవాద సిద్ధాంతాలు, అంబేద్కర్‌, పూలేల కులరహిత సమాజాలు, మధర్‌థెరిస్సా మానవతా వాదాలు వల్లె వేసే పవన్‌కళ్యాణ్‌ సొంతజిల్లాలో జరుగుతున్న రాచరిక పెత్తనాలపై నోరుమెదపలేకపోతున్నాడు.

తనపార్టీ కాపులపార్టీ కాదని, అసలు ఒకకులం వాడిగా గుర్తింపు పొందడం తనకు ఇష్టంలేదంటూ అన్ని కులాలకు చెందిన వాడినని చెప్పుకుంటున్న జనసేనాని చివరికి ఏ కులం ఆదరణ కూడా పొందలేక ఎవరికీ కాకుండా పోతున్నాడు. గరగపర్రు ఘటనపై ఏదో ఒకటి మాట్లాడదామని భావించిన పవన్‌కు సొంతకులం నేతలు నచ్చజెప్పారట. ఎందుకంటే గరగపర్రు కులపోరు సూత్రధారులు రాజులు కాబట్టి. 

పశ్చిమగోదావరి జిల్లాలో రాజులు, కాపుల మధ్య ఆధిపత్యపోరు ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇన్నాళ్లు పరోక్షంగా సాగిన ఈ పోరాటం పవన్‌ జనసేన స్థాపనతో ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో ఇరుకులాల మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కాపు యువత పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌గా, రాజుల యువత ప్రభాస్‌ అభిమానులుగా మారిపోయి నిత్యం కలహించుకుంటుంటారు.

ఇరు కులాల మధ్య స్పష్టమైన చీలిక ఏర్పడిపోయింది. గతంలో పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భీమవరంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు చించివేశారు. ప్రభాస్‌ అభిమానులైన రాజుల కుర్రోళ్ల పనే ఇది అని కాపు యువత ఆరోపించింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒకరి హీరో కటౌట్లను మరొకరు ధ్వసం చేసుకున్నారు. పోలీసులు 144 సెక్షన్‌ విధించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

ఇలాంటి తరుణంలో అదే భీమవరం వద్ద రాజులు, మాలల మధ్య కులపోరు పరుడుపోసుకుంది. మాల యువకుల ధిక్కార ధోరణిని సహించలేకపోతున్న రాజులు వారిని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. గరగపర్రులో తమ మాటనికాదని మాలలు అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించడం రాజుల అహంకారాన్ని దెబ్బకొట్టింది. దీంతో మొత్తం మాలపల్లెను వెలివేశారు.

రాజులు మాత్రమే కాదు తతిమా కులాల వారెవ్వరూ కూడా మాలలను పనిలోకి పిలవడానికి లేదు. వారికి నిత్యావసర సరుకులు అమ్మకూడదు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయకూడదు. దీన్ని ధిక్కరిస్తే భారీ జరిమానా... ఇది అక్కడి అరాచకం. అయినా నిత్యం అంబేద్కర్‌ సిద్ధాంతాలు ప్రవచించే పవన్‌కళ్యాణ్‌ మాత్రం ఈ సాంఘిక దురాగతంపై పెదవి విప్పలేకపోతున్నాడు. 

 గరగపర్రు ఘటనపై స్పందిస్తే అది కాపు, రాజు కులాల మధ్య మరోసారి కలహాలు చెలరేగే ప్రమాదానికి దారితీయొచ్చనే భయం పవన్‌కళ్యాణ్‌ను వెనక్కి లాగింది. పవన్‌కళ్యాణ్‌ చెబితే రాజులు ఎలాగూ వినరు. ఇంకోవైపు దళితులకు తొలినుంచీ కాపు కులంపై నమ్మకంలేదు. గోదావరిజిల్లాల్లో రాజలు కంటే కాపులే ఎక్కువగా దళితులపై పెత్తనం చేస్తుంటారు. ఇంతకంటే ఎక్కువగా కాపులు దళితులను వేధించిన ఘటనలు గతంలో అనేకం నమోదయ్యాయి.

కాబట్టి స్థానిక దళితులు కూడా పవన్‌ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ ఘటనపై ఎలా స్పందించాలో, ఎలాంటి నీతి వాక్యాలు వల్లించాలో, ఎవరిని సమర్థించాలో, ఎవరిని నిందించాలో తెలియక చివరికి మౌనమే మంచిదని దాన్ని ఆశ్రయించాడు పవర్‌స్టార్‌. తనకు ఎలాంటి కులంలేదని చెప్పినా ఇతర కులాల యువత ఎవ్వరూ పవన్‌ను అంగీకరించే పరిస్థితి గోదావరి జిల్లాల్లో లేదు. రాజులకు నచ్చజెప్పేంత సీను ఎటూలేదు. సొంతజిల్లాలో జనసేనాని సత్తా అది. అందుకే పవన్‌ నుంచి ప్రశ్నలు రావడంలేదు.

-సుమన్‌రెడ్డి లక్కిరెడ్డి

Show comments