తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారాయన. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతనని తనకు తానుగా ఫీలయిపోయే నట్టికుమార్ గురించే ఇదంతా. ఆయన ఏం సినిమాలు చేశారు.? అని ఒక్కసారి ఆలోచిస్తే, గట్టిగా సరైన సినిమా ఒక్కటి కూడా కనిపించదు. కానీ, ఆయన కూడా ఓ నిర్మాతే. ఎక్కువగా వివాదాల్లో వుండే నట్టికుమార్, ఆ వివాదాలతోనే ఎదిగాడన్నది జగమెరిగిన సత్యం.
టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం ప్రకంపనలకు నట్టికుమారే కారకుడు. పలువురు తెలుగు సినీ ప్రముఖులకు నయీంతో సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసిన నట్టికుమార్, మరీ ముఖ్యంగా సి.కళ్యాణ్, బండ్ల గణేష్ వంటివారిపై విరుచుకుపడ్డ విషయం విదితమే. ఈ క్రమంలోనే సి.కళ్యాణ్ నుంచీ ఘాటుగా ఎదురుదాడి ఎదుర్కోవాల్సి వచ్చింది నట్టికుమార్‌కి. అప్పుడూ తగ్గలేదు.. సి.కళ్యాణ్‌తో పోటీ పడి మరీ తిట్టేశారు.
సి.కళ్యాణ్, వర్సెస్ నట్టికుమార్.. తిట్ల పర్వం కొనసాగింది. బూతులు తిట్టుకున్నారు.. నీలి చిత్రాల బాగోతాల గురించి 'గతాన్ని విప్పుకున్నారు'. ఇంతా జరిగాక, ఇప్పుడు నట్టికుమార్ ఆసుపత్రి పాలయ్యారు. దానిక్కారణం, సి.కళ్యాణ్ చేసిన ఆరోపణలేనట. ఇది మరీ కామెడీ. నట్టికుమార్ చేసిన ఆరోపణలకి సి.కళ్యాణ్, బండ్ల గణేష్, అశోక్‌కుమార్ లాంటోళ్ళు ఏమైపోవాలి.?
ఒకరి మీద విమర్శలు చేయడం సులువే.. మళ్ళీ అట్నుంచి విమర్శలు మాత్రం రాకూడదు. వస్తే, ఇదిగో.. ఇలాగే జెర్రమొచ్చేస్తుంది. 'ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి..' అంటూ సి.కళ్యాణ్ సహా, నట్టికుమార్ ప్రత్యర్థులు చేసిన సవాల్‌తో, నట్టికుమార్‌కి జెర్రమొచ్చింది (జెర్రమంటే జ్వరమే కాదండోయ్.. ఇదో టైపు పబ్లిసిటీ అనారోగ్యం అనుకోవాలి). అద్గదీ సంగతి.