నిరుద్యోగ రణం.. అరెస్టుల పర్వం.!

తెలంగాణ జేఏసీ చేపట్టిన నిరుద్యోగ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, తెలంగాణ జేఏసీ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి హైద్రాబాద్‌కి వచ్చే మార్గాలన్నిటిపైనా పోలీసులు నిఘా పెట్టారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానితులెవరూ నగరం వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినాసరే, హైద్రాబాద్‌లో మాత్రం నిరుద్యోగులు హల్‌చల్‌ చేయడం గమనార్హం. 

తెల్లవారుఝామనే తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొంటే, విద్యార్థుల జీవితాలు నాశనమైపోతాయంటూ పోలీసులు హెచ్చరికలు చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. చాలాకాలం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మరోమారు రణరంగమైపోయింది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కన్పిస్తున్నాయనక్కడ. పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

ఈ మధ్యకాలంలో ప్రజా ఉద్యమాలకు అధికారంలో వున్నవారు బెంబేలెత్తిపోవడం సర్వసాధారణమైపోయింది. ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలన్న కోణంలో ఆలోచనలు చేయడం తప్ప, అసలెందుకు ఉద్యమాలు తలెత్తుతున్నాయన్న ఆలోచనలు పాలకులకు కలగడంలేదు. తెలంగాణ జేఏసీ మీద ఇప్పటికే 'తీవ్రవాద ముద్ర' వేసేసిన తెలంగాణ సర్కార్‌, అరెస్టయిన తెలంగాణ జేఏసీ నేతల్ని కలిసేందుకు వెళ్ళేవారిని అరెస్ట్‌ చేసేస్తుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, ఈ ఎపిసోడ్‌లో తెలంగాణ జేఏసీ కొంతమేర విజయం సాధించిందనే చెప్పాలి. ఓ వైపు అరెస్టులు, ఇంకోవైపు ఆందోళనలు.. వెరసి హైద్రాబాద్‌ రణరంగంగా మారిపోయింది.  Readmore!

తెలంగాణలో తెలంగాణ జేఏసీ ఆందోళనలు ఇలా వుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతి పర్యటనలో బిజీ బిజీగా వున్నారు. ఉదయాన్నే తిరుమల కొండపై వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌, తెలంగాణ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి దేవాలయాన్ని సందర్శించి, అక్కడా మొక్కులు చెల్లించుకున్నారు. కాస్సేపట్లో ఆయన హైద్రాబాద్‌కి తిరుగు పయనమవనున్నారు.

Show comments