వాళ్ల బలహీనతే.. శశికళ బలం!

ఎంతమంది వ్యతిరేకించినా, ప్రజలు ఆమె పట్ల ఆగ్రహోద్రిక్తతతో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా.. శశికళ మాత్రం వెనుకంజ వేయడం లేదు. అంత తేలికగా తరిగేలా లేదు ఆమె బలం. శశికళ క్యాంప్ నుంచి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు గాయాబ్ అనే వార్తలు వస్తున్నా, శశికళ క్యాంప్ లోని కొంతమంది ఎమ్మెల్యేలు తనకే మద్దతు పలుకుతారని పన్నీరు సెల్వం విశ్వాసం వ్యక్తం చేస్తున్నా.. శశికళ వెంట కచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనడానికి బలమైన రీజన్లు ఉన్నాయి. ఆమె వెంట ఉండే ఎమ్మెల్యేల సంఖ్య భారీ స్థాయిలోనే ఉండవచ్చు కూడా! 

ఇప్పుడు పన్నీరు వెంట నడిస్తే.. డీఎంకేతో చేతులు కలపక తప్పదు.. అనేది చాలా మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భయం. పన్నీరు వెంట వెడితే, వీళ్ల పదవులు నిలబడాలంటే డీఎంకే మద్దతు తప్పనిసరి. సైద్ధాంతికంగా డీఎంకేతో వ్యతిరేకత సంగతి ఎలా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో డీఎంకే నేతలతో తలపడే వీళ్లు.. డీఎంకే మీద ఆధారపడే పన్నీరు వెంట నడవడానికి సహజంగానే ఇష్టపడరు. ఒకవేళ ఇప్పుడు పన్నీరు వెంట వెళ్లినా, ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలియదు!

స్టాలిన్ తుమ్మితే.. పన్నీరు ప్రభుత్వం కుప్పకూలుతుంది. అప్పుడు అన్నాడీఎంకేకి కాకుండా, డీఎంకేకీ కాకుండా తయారవుతుంది వీరి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శశికళపై మనసులో ఎలాంటి భక్తీ లేకపోయినా.. తప్పనిసరిగా ఆమె వెంట ఉండక తప్పడం లేదు ఎమ్మెల్యేలకు. ఇది వీరి బలహీనత.. శశికళ బలం! 

ఈ నేపథ్యంలో పోయేవాళ్లు కొంతమంది ఉన్నా.. శశికళ వెంట ఉండే ఎమ్మెల్యేల సంఖ్య మూడంకెల సంఖ్యలోనే ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక  శశికళ కూడా ఊరికే ఉండటం లేదు.. కాంగ్రెస్ బలాన్ని అరువు అడుగుతోంది. ఎనిమిది ఎమ్మెల్యేలున్నారు ఆ పార్టీకి. అలాగే ఇదే అదునులో డీఎంకే బుట్టలోనూ ఆమె చేతులు పెట్టే యత్నం చేస్తోందని వినికిడి. ఆ పార్టీలోనూ అసంతృప్తులు ఉంటారు కదా! వారిని తన వైపుకు తిప్పుకునే యత్నం చేసి.. అటు పన్నీరును ఇటు స్టాలిన్ ను దెబ్బకొట్టడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

Readmore!

ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఒక్కటీ లభించడం లేదు కానీ.. పన్నీరు, స్టాలిన్, బీజేపీలను గట్టిగానే ఎదుర్కొంటోందీమె. 

Show comments