అంబరీష్‌ తక్కువోడేమీ కాదు!

కర్నాటక కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ సినీ నటుడు అంబరీష్‌ ఇటీవలే మంత్రి పదవి కోల్పోయారు. తనను మంత్రి పదవికి దూరం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మండిపడుతూ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేశారు. మంత్రి పదవికి అనర్హుడినైతే, ఎమ్మెల్యే పదవికీ అనర్హుడినే కదా.. అంటూ వితండవాదం చేస్తూ అంబరీష్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

అయితే, మొదటినుంచీ అంబరీష్‌ రాజకీయాల్లో వివాదాస్పదుడే. సినిమాల్లో 'రెబల్‌స్టార్‌' అన్పించుకున్న అంబరీష్‌, రాజకీయాల్లోనూ అలాగే వ్యవహరించారు. గతంలో, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలు ఆయనపై వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, నిధుల్ని అడ్డగోలుగా విడుదల చేయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పదవి ఊడుతుందన్న ప్రచారమూ జరిగింది. ఎలాగో ఆ సమయంలో అంబరీష్‌ తన పదవిని నిలబెట్టుకున్నారు. 

అంబరీష్‌కి వున్న సినీ గ్లామర్‌, ఆయనకున్న అగ్రెసివ్‌ నేచర్‌.. వీటి కారణంగా, అంబరీష్‌ని కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఉపేక్షించింది. ఈసారి మాత్రం, అంబరీష్‌పై వేటు వేయాలనే కాంగ్రెస్‌ అధిష్టానం తీర్మానించింది. కానీ, ఇదంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రేనంటూ కర్నాటక కాంగ్రెస్‌లో రెబల్స్‌ గ్రూప్‌ని తయారుచేసేందుకు అంబరీష్‌ ప్రయత్నిస్తుండడం గమనార్హం. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దారుణం. ఈ తరుణంలో, అంబరీష్‌ పంచాయితీ కాంగ్రెస్‌ పార్టీని నిలువునా ముంచేయడం ఖాయం. 

ఇంకో రెండేళ్ళలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుంది. అప్పటిదాకా ఆగుతుందా.? కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రతరమై, సిద్ధరామయ్య ప్రభుత్వం కుప్పకూలిపోతుందా.? అధికారం కోసం కాచుక్కూర్చున్న బీజేపీకి, అంబరీష్‌ టీమ్‌ ఏ మేరకు సహాయపడ్తుంది.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకి.

Show comments