కోడిగుడ్డు మీద ఈకలు పీకేయడం.!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, మాంఛి పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ పేల్చారు. గత ఎన్నికల్లో తాను 11 కోట్లు ఖర్చు చేశానన్న మాటల్లో వాస్తవం లేదనీ, 11 కోట్లు ఖర్చయ్యాయని మాత్రమే చెప్పాననీ సెలవిచ్చారు. ఇలాంటి విషయాల్లో వివాదాలు సృష్టించడమంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని చెప్పారాయన. వారెవ్వా, బహుశా సినిమాల్లో కూడా ఇలాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఎవరూ రాయలేరేమో. 

అవును మరి, 11 కోట్లు ఖర్చు చేశాను.. అన్నదానికీ, 11 కోట్లు ఖర్చయ్యింది.. అన్నదానికీ తేడా కోడెల శివప్రసాద్‌గారికి మాత్రమే తెలుసు. ఇంకెవరన్నా ఇందులోని 'తేడా' గమనించగలరా.? ఛాన్సే లేదు. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. చెప్పేటోడు.. అదేదో అన్న చందాన తయారయ్యిందిప్పుడు వ్యవహారం. 

ఓ వస్తువు కొనడానికి 10 రూపాయలు ఖర్చయ్యిందనడానికి.. ఆ వస్తువు కోసం 10 రూపాయలు ఖర్చు చేశాననడానికీ పెద్దగా తేడా ఏమీ వుండదు మరి. అయినా, కోడెల దానికీ దీనికీ తేడా వుంటుందంటున్నారు. తప్పదు మరి, తేడా లేదని కోడెల ఒప్పేసుకుంటే, ఎమ్మెల్యే పదవికే కాదు.. స్పీకర్‌ పదవికి కూడా దూరమైపోవాల్సి వస్తుంది. దటీజ్‌ కోడెల శివప్రసాద్‌. అసెంబ్లీలో అధికార పక్షం చేసే అల్లరి ఆయనకు కన్పించదు. ప్రతిపక్షం చేసే అల్లరి మాత్రమే కనిపిస్తుందాయనకి. 

ఇదిలా వుంటే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి కోడెల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్లు ఏవీ రాజ్యాంగ బద్ధంగా లేవన్నది కోడెల ఉవాచ. 'మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్‌ చేశారు మొర్రో..' అని వైఎస్సార్సీపీ, స్పీకర్‌ కోడెలకి ఫిర్యాదు చేస్తే.. అవి రాజ్యాంగ బద్ధంగా లేవనడమేంటో.! అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలో ఏమో.! 

11 కోట్లు గత ఎన్నికల్లో ఖర్చు చేయడం అనే విషయం అందరికీ తెలిసినా, దాన్ని బుకాయించేశారు. అది ఈకల్లేని కోడిగుడ్డు వ్యవహారం. ఇక్కడ, 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.. ఇది కూడా ఈకల్లేని కోడిగుడ్డు వ్యవహారమే. అదెట్టాగబ్బా.? ఇది చంద్రబాబు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రాకరమే స్పీకర్‌ నడుచుకోవాలి.. ఏం చేస్తాం.? ఏం చేయగలం.!

Show comments