జగన్ భయపడాలి గానీ.. మీకు ఏడుపెందుకు?

వైఎస్ జగన్మోహనరెడ్డి ప్లీనరీ సభల్లో మద్యనిషేధం గురించి చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎలాంటి స్పందన కలిగిస్తోంది? జగన్ చేసిన ప్రకటనకు జనంలో ఆదరణ ఎంతమాత్రం ఉంటుంది? అనే సందేహాలు ఎవ్వరికైనా కలగడం సహజం. ఆ మాటకొస్తే జనంలో జగన్ స్టేట్‌మెంట్ ఎంత ప్రభావం చూపిస్తున్నది.. అనే సంగతి కూడా మనకు తెలుగుదేశం నాయకుల స్పందనలోనే దొరికిపోతుంది.

అచ్చం అలాగే.. ఇప్పుడు తెదేపా నాయకులు స్పందిస్తున్న తీరును గమనిస్తే.. మద్యనిషేధం అనే పదం గురించి, ప్రజల్లో జగన్‌కు మంచి పేరు తెచ్చి పెడుతుందని వారు చాలా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ విషయంలో జగన్ మీద నిందలు వేయడానికి వారు చాలా తాపత్రయ పడిపోతున్నారు.

మద్యం అనేది జనజీవితాల్ని ఎంతగా అతలాకుతలం చేసేస్తున్నదో అందరికీ తెలిసిన సంగతే. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా.. చాలా ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుండడం కూడా తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ప్రజల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు.. దాని నిషేధం గురించి జగన్ చేసిన ప్రకటన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సరిగ్గా ఆ పాయింటు గురించే తెలుగుదేశం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.

మరోదారి లేక వారిప్పుడు ఎదురుదాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మద్యం వ్యాపారుల్లో 75శాతం వైసీపీకి చెందిన వారే అని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. అయినా ఆ వ్యాపారాల్ని వారికి కట్టబెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అనే సంగతిని మరచిపోతున్నారు. ఒకవేళ 75శాతం వ్యాపారులు వైసీపీ వారే అయితే గనుక.. తమ పార్టీకి చెందిన వారి వ్యాపారాలను మూయించేయాలనే నిర్ణయానికి వచ్చినందుకు ఆ పార్టీ అధినేత జగన్ భయపడాలి.

అంతే తప్ప... మద్యనిషేధం నిర్ణయం గురించి తెలుగుదేశం నాయకులు విలపించడం ఎందుకు అనే ప్రశ్న జనంలో ఉదయిస్తోంది. తెలుగుదేశం వారికి అర్థం కావట్లేదేమో గానీ.. వారి విమర్శల వల్ల జగన్ కే ఎడ్వాంటేజీ ఎక్కువ. ఇలాంటి వ్యాఖ్యలు వారు చేస్తే.. ‘‘తన సొంత పార్టీకి వచ్చే లాభాలను కూడా పణంగా పెట్టి.. ప్రజల సంక్షేమం కోసం జగన్ మద్యనిషేధం ప్రకటన చేశాడని జనం భావించే అవకాశం ఏర్పడుతుంది.

Show comments