తగుదునమ్మా అంటూ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన బీఏసీ సమావేశాలకు హాజరయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు షాక్ తగిలింది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు కారణంగా, బీఏసీ సమావేశానికి ఎలా హాజరవుతారని స్పీకర్ మధుసూధనాచారి ప్రశ్నించడంతో కాస్సేపు ఆయనతో వాగ్వివాదానికి దిగారు రేవంత్‌రెడ్డి. టీడీపీకి తెలంగాణలో మిగిలింది ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు, టీడీపీకి దూరంగా వుంటున్నారు. మిగతావాళ్ళంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దాంతో, ఎంత గింజుకుంటున్నా రేవంత్‌రెడ్డి గొంతుక బయటకు రావడంలేదాయె. రేవంత్‌తో పోల్చితే, సండ్ర వాయిస్ అస్సలు బయటకురాదు.
ఇక, బీఏసీ సమావేశంలో తమకు జరిగిన అవమానం గురించి రేవంత్‌రెడ్డి గుస్సా అయ్యారు. ఏ స్థాయిలో అంటే, 'పసుపు జెండా చూస్తే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చలిజ్వరమొచ్చేస్తోంది.. అందుకే మమ్మల్ని రానివ్వడంలేదు..' అనే స్థాయిలో. కేసీఆర్, తెలంగాణ టీడీపీకి భయపడ్తున్నారో, తెలంగాణ టీడీపీనితో ఆడుకుంటున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నిన్న మొన్నటిదాకా పార్టీ ఫిరాయింపులపై టీఆర్‌ఎస్‌ని రేవంత్‌రెడ్డి గట్టిగానే ప్రశ్నించారు. కానీ, ఇప్పుడా ఛాన్స్ కూడా ఆయనకు లేదు. ఎందుకంటే, అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు కదా.!
తెలంగాణ రాష్ట్రం వచ్చింది మొదలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యిందే చాలా చాలా తక్కువ. అసలంటూ అసెంబ్లీ వైపు రేవంత్‌రెడ్డిని రానీయకుండా తెలంగాణ సర్కార్ రాజకీయ వ్యూహాలకు పదును పెడ్తోంది. కానీ, తప్పదు.. అసలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటాయె. దాంతో, రేవంత్‌రెడ్డి పడరాని పాట్లూ పడాల్సి వస్తోంది. రేవంత్‌రెడ్డి పరిస్థితే ఇలా వుంటే, తెలంగాణలో పసుపుదళం పరిస్థితి ఇంకెలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! చేసుకున్నోడికి చేసుకున్నంత.. అంటే ఇదేనేమో.! పైకి చెప్పడంలేదుగానీ, 'పసుపు దళానికి ఇదేం ఖర్మ.?' అని రేవంత్‌రెడ్డి కూడా లోలోపల వాపోతూనే వుండివుంటారు.