చంద్రబాబునే ఎందుకు తిడతారంటే.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'నన్నే ఎందుకు తిడతారు.? రెండు రాష్ట్రాలూ నాకు ముఖ్యమే.. అలా అన్నందుకే నన్ను విమర్శిస్తారా.?' అంటూ వాపోతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు, తన ఆవేదనను వెల్లగక్కుకున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా వుందంటూ తమ సమస్యల్ని అధినేత వద్ద ఏకరువు పెడదామనుకున్న తెలంగాణ టీడీపీ నేతలకు, అధినేతే తిరిగి తమ వద్ద గగ్గోలు పెట్టడం పెద్ద షాకే.! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి టెన్షనేమీ లేదు.. తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నారు, తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు అయ్యారు. తెలంగాణ ప్రయోజనాల కోసమంటూ సెంటిమెంట్‌ని ఎలా రాజెయ్యాలో కేసీఆర్‌కి తెలుసు. ఈ క్రమంలో కేసీఆర్‌, టీడీపీని బీభత్సంగా టార్గెట్‌ చేశారు. టీడీపీ పని తెలంగాణలో ఖతమయ్యింది కూడా. ఇప్పుడు కాంగ్రెస్‌ మీద దృష్టిపెట్టారు. ఓ పక్క సెంటిమెంట్‌ రాజేస్తున్నారు.. ఇంకోపక్క రాజకీయంగా ప్రత్యర్థి లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ, కేసీఆర్‌కి మరో రాష్ట్రంతో సంబంధమే లేదు. 

చంద్రబాబు పరిస్థితి అలా కాదు, తెలంగాణలో పార్టీ బతికే పరిస్థితుల్లేకపోయినా.. తెలంగాణలో పార్టీని బతికించాలన్న ఆరాటం ఆయనది. జాతీయ పార్టీ అధ్యక్షుడినని చెప్పుకోవాలి కదా.. అదీ ఆయన తాపత్రయం. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించిన చంద్రబాబుకి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి అనేది సరిపోవడంలేదేమో.! అందుకే, తెలంగాణలో ఎలాగైనా ఉనికిని చాటుకోవడాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని తాకట్టుపెట్టేస్తున్నారు.. అక్కడే వస్తోంది అసలు సమస్య అంతా. 

2014 ఎన్నికల సమయంలోనే కాదు.. అంతకు ముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తేలిపోయింది. అప్పుడే చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల గురించి ఆలోచించి వుంటే పరిస్థితి ఇలా వుండేది కాదు. అసలు ఆంధ్రప్రదేశ్‌కి ఈ స్థాయిలో నష్టమూ జరిగేది కాదు. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌తోపాటు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఒకప్పటి పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన భూభాగాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేసి వుండాల్సింది. 

సరే, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లో వున్నది తెలుగువారే గనుక.. పంచాయితీలు అనవసరం. ఇప్పుడు ఈ విషయమై ఎంత చర్చించుకున్నా శుద్ధ దండగే. కానీ, చంద్రబాబు ఆలోచనా విధానం మారాలి. ఇకనైనా ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రినన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి. పార్టీ పగ్గాల్ని లోకేష్‌కే అప్పగిస్తారో, ఇంకొకరికే ఇచ్చేస్తారో.. అది చంద్రబాబు ఇష్టం. కానీ, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కి పూర్తిస్థాయిలో న్యాయం చేయగలగాలి. 

ఇంకా, తెలంగాణని పట్టుకుని వేలాడితే, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కీ.. అలాగే చంద్రబాబుకీ నష్టమే తప్ప, లాభం లేదు. ఏం చేసినా, తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బలపడనివ్వరు. 'ఆంధ్రా పార్టీ..' అన్న విమర్శ ఒక్కటీ చాలు, టీడీపీకి తెలంగాణలో నూకలు లేకుండా చెయ్యడానికి. ఆ అస్త్రమెప్పుడూ కేసీఆర్‌తోనే వుంటుంది. పైగా, 'రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో తెలంగాణని అడ్డుకున్నారు..' అన్న ఆరోపణలూ చంద్రబాబుపై వుండనే వున్నాయి. 

ఇప్పుడు చంద్రబాబు తక్షణ కర్తవ్యం ఒకటే.. తెలంగాణలో ఎటూ ఆయన్ని తిట్టుకుంటున్నారు గనుక.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం. కానీ, ఆల్రెడీ ఆ పరిస్థితి వచ్చేసింది. విభజన పంపకాలకు సంబంధించి చంద్రబాబు చెబుతున్న నష్టాల్లో ఆయన పాపం కూడా లేకపోలేదు. అలాంటి తప్పుడు పంపకాల్ని చంద్రబాబు ఇప్పటికీ ప్రశ్నించలేకపోతున్నారు. కేంద్రంలో చంద్రబాబు మద్దతిచ్చిన ప్రభుత్వమే వుంది గనుక, పంపకాలు తప్పుడువేనని చెబుతున్న ఆయన మాటలు నిజమే అయితే, ఆయన ఆ విషయంలో కార్చుతున్నది మొసలి కన్నీరే కాకపోతే.. కేంద్రంపై 'సమాన పంపకాలకు' సంబంధించి ఒత్తిడి తీసుకురావాలి కదా.? ఇందుకే మరి, చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్‌లోనూ జనం తిట్టుకుంటున్నది. చంద్రబాబుగారూ.. అర్థమవుతోందా మీకు.?

Show comments