ఇదేనా తెలుగు వాడి ఆత్మగౌరవం.. ఏ కాంగ్రెస్ హాయంలోనో… లోక్ సభలో ఈ విధంగా ఒక తెలుగు ఎంపీ కి అవమానం జరిగి ఉంటే, ఇలాగే ఏ మహారాష్ట్ర వాళ్లో రుబాబు చేసి ఉంటేనా… ఇక తెలుగుదేశాన్ని, వీర తెలుగువాళ్లను పట్టడానికి ఉండేదా? పోయింది తెలుగు వాడి ఆత్మగౌరవం… తెలుగు వాడి ఆత్మగౌరవంపై దారుణమైన దెబ్బ… తెలుగు వాళ్ల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ మంట గలుపుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు… అంటూ పడికట్టు డైలాగులు వల్లెవేసేవాళ్లు!
మరి అవతల ఉన్నది మోడీ సర్కారు.. ఇవతల ఉన్నది చంద్రన్న సర్కారు.. ఇంకేముంది… ఇవన్నీ మాఫ్. శివసేన ఎంపీలు తెలుగు ఎంపీ చుట్టూ మూగినా… ఆయనపై దాడికి దిగినా.. అన్నీ మాఫ్. ఇవన్నీ అవమానాలు కాదు.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇదేమీ ముప్పు కాదు. ఇదే కాదు.. రేప్పొద్దున్నే ఇలాంటి రౌడీ మూకలు ఏపీ ఎంపీలను ఈడ్చి తన్నినా.. అబ్బే.. ఏం కాలేదు, అనే అంటారు కానీ, తెలుగువాడి ఆత్మగౌరవానికి వచ్చిన ముప్పేం లేదు. ఎందుకంటే.. ఏలుతున్నది తెలుగుదేశం పార్టీ!
తెలుగుజాతి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే తప్పుకానీ, తెలుగుదేశం వాళ్లైతే తన్నించుకున్నా.. తప్పులేదు. అయినా.. కొత్తగా పోయిందేముంది? వెనుకటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీకి తరచూ వెళితే చంద్రబాబు మామూలుగా విరుచుకుపడేవాడా? ఇష్టానుసారం మాట్లాడేవాడు. ఇప్పుడు మాత్రం బాబు మూడేళ్లలో ఎన్ని సార్లు చుట్టేశారో లెక్క బెట్టడం కూడా కష్టం అయ్యింది. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. మరో రెండేళ్లలో సెంచరీ కాస్తా పూర్తయ్యేటట్టుగా ఉంది.