బాబుకు ఎవ్వరూ భయపడటం లేదిక్కడ..!

ఇదో ప్రహసనం అయిపోయింది.. మూన్నాళ్లకు ఒకసారి ఇవే పంచాయతీలు! ఒక రోజేమో కర్నూలు గొడవ, ఇంకో రోజు జమ్మలమడుగు రచ్చ, ఆ తర్వాత అనంత వరస.. ‘బాబు హెచ్చరించాడు..’ ‘కలిసి పనిచేయాలని వారిని ఆదేశించాడు’  ‘బాబు రాజీ కుదిర్చారు’ ‘ఇరువర్గాల నేతలూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు..’ ‘కథ సుఖాంతం..’ ‘కలిసి పని చేస్తామని ఇద్దరు నేతలూ బాబుకు హామీ ఇచ్చారు..’ తెలుగుదేశం అనుకూల మీడియాలో రాయలసీమ టీడీపీ గొడవల గురించి ఇలాంటి కథనాలు చదవి, చదవి జనాలకు విసుగొచ్చింది.

మళ్లీ అదే కథ పునరావతం. ఇప్పటి వరకూ అనంతలో చాలానే లొల్లి జరిగింది. జేసీ-ప్రభాకర్ చౌదరిల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కొన్ని నెలలుగా రోడ్డుకు ఎక్కింది. ఈ విషయంలో ధర్నాలు, దీక్షలు.. హెచ్చరించుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు.. ఎంపీ హోదాలో ఉన్నదొకరు, ఎమ్మెల్యే మరొకరు. ఒకే పార్టీకి చెందిన నేతలిద్దరూ. జిల్లా కేంద్రం వేదికగా జరుగుతున్న వీళ్ల రచ్చ ప్రజలకు ఒక విసుగుగా మారింది.

ఎందుకురా వీళ్లను ఎన్నుకున్నాం.. అని తటస్థులు ఆవేదన భరితులవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి చంద్రబాబు జోక్యం చేసుకోలేదా? అంటే.. చేసుకున్నాడు చాలాసార్లు! అయితే ఏం ప్రయోజనం? అసలు బాబును టీడీపీ నేతలు లెక్క చేస్తుంటే కదా? మొన్న జరిగిన పంచాయతీకి కూడా ప్రభాకర్ చౌదరి, అనంతపురం మేయర్ హాజరయ్యారు కానీ.. దాన్ని జేసీ లెక్క చేయలే! బాబు దగ్గర జరిగిన పంచాయతీకి జేసీ హాజరు కాలే! అదేమంటే.. చంద్రబాబే ఫోన్ చేసి వెళ్తా.. అని జేసీ స్పష్టం చేశాడు!

కేవలం అనంతపురం రచ్చ మాత్రమే కాదు.. కదిరిలో ఫిరాయింపు ఎమ్మెల్యేకూ- తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జికి మధ్య వార్ నడుస్తోంది. ధర్మవరంలో వరదాపురం వర్టం- పరిటాల వర్గం కొట్టుకోవడం కూడా అయిపోయింది. నెక్ట్స్ ఎపిసోడ్లో నరుక్కోవడం జరిగినా ఆశ్చర్యపోవద్దు.
ఇక జమ్మల మడుగు వ్యవహారం మూడు రాజీలు ఆరు గొడవలు అన్నట్టుగా సాగుతోంది పరిస్థితి. అక్కడ కత్తులు దూసుకొంటూనే ఉన్నారు. కర్నూలులో భూమా, శిల్పా వర్గాల మధ్య బహిరంగ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వాళ్ల మధ్య కూడా బాబు పలుమార్లు రాజీ చేశాడు. అయితే.. అవన్నీ ఉత్తుత్తి ముచ్చట్లే! వాళ్లు కూడా బాబును లెక్కచేయడంలా!

ఫిరాయింపు రాజకీయాల వల్ల కొన్ని చోట్ల, నానా జాతి సమితీ ఎన్నికల ముందు వచ్చి తెలుగుదేశంలో చేరడం వల్ల ఇంకొన్ని చోట్ల.. ఏతావాతా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో విధ్వేషాలు పతాకస్థాయికి చేరాయి. మరి ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి.  రేపు నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా.. ఎన్నికలు గనుక జరిగితే.. తెలుగుదేశాన్ని ఓడించడానికి తెలుగుదేశమే చాలు!

Show comments