ఆ సినిమాల విడుదల అందుకేనా?

సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 రెడీగా వున్నాయి. ఈ విషయం చాలా ముందుగానే వెల్లడయిపోయింది. అయినా కూడా మరో రెండు మీడియం సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. ఒకటి శర్వానంద్ శతమానం భవతి, రెండవది వెంకీ గురు. శతమానం భవతి ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా. గురు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా. ఈ రెండింటిని కూడా సంక్రాంతికి వదలడం వెనుక వేరే స్ట్రాటజీ వుందని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల వెనుక వున్నది దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు. రెండు రాష్ట్రాల్లో వీళ్లిద్దరి కంట్రోల్ లో చాలా ధియేటర్లు వున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కనుక లేకుంటే, వీరి వీరి థియేటర్లను అయితే శాతకర్ణికి లేదా ఖైదీకి ఇవ్వాలి. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే సమస్య. 

అటు చూస్తే బాలయ్య ఇటు చూస్తే మెగాస్టార్. రెండు వైపులా రకరకాల మొహమాటాలే. అందువల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితే. అదే కనుక తమ సినిమాలే వుంటే, ఇక అవతలి వారు తమకు థియేటర్లు ఇవ్వమని అడిగే పరిస్థితి వుండదు. ఇక ఆబ్లిగేషన్, మొహమాటం వంటి ఇబ్బందులు వుండవు. 

పైగా శతమానం భవతి లాంటి ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి బాగానే వుంటుంది. ఇక గురు సంగతంటారా? దాని బడ్జెట్ కు, తమిళ వెర్షన్ ను చాలా వరకు వాడుతూ,తెలుగులో తక్కువ టాకీ షూట్ కు లెక్కేసుకుంటే బడ్జెట్ చాలా తక్కువ. పండగ లాంటి సీజన్ లో వన్ వీక్ ఆడినా చాలు. సో ఇలా అన్నీ ఆలోచించే దిల్ రాజు, సురేష్ బాబు ఇలా ఫిక్సయ్యారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show comments