అమరావతి: ముఖ్యమంత్రికీ ఎంట్రీ టిక్కెట్‌.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వెరైటీగా నిర్మితం కానుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాల మాటెలా వున్నా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇది పూర్తిస్థాయిలో ప్రైవేటు రాజధాని అవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో సామాన్యులకు చోటు దక్కడం గగనమే. ప్రభుత్వ కార్యాలయాలకీ ఆస్కారం వుంటుందా.? లేదా.? అసలు అమరావతిలోకి ఎంట్రీ టిక్కెట్‌ లేకుండా ముఖ్యమంత్రి సైతం వెళ్ళగలిగే పరిస్థితి వుంటుందా.? ఇలా సవాలక్ష అనుమానాలు. 

కన్సార్టియంను ఏర్పాటు చేసి, అందులో రెండు సింగపూర్‌ కంపెనీలకు 52 శాతం వాటా ఇచ్చేసి, మిగిలిన 48 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వుంటే, పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ 48 శాతం వాటా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేనా.? అన్నదానిపైనా అనుమానాలున్నాయి. ఎందుకంటే, ఇది అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీకి సంబంధించిన వాటా. ఇక్కడి నుంచి మళ్ళీ, ఇతర సంస్థలకు కేటాయింపులు, వాటాలు వుండొచ్చు. 

52 శాతం వాటా పొంది, నిర్మాణాలపై హక్కుల్ని దక్కించుకుంటే, అందులోకి వెళ్ళేందుకు సామాన్యులకు అవకాశమెలా దక్కుతుంది.? ఛాన్సే లేదు. ప్రధానమైన రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ వాటా చాలా తక్కువగా వుండే అవకాశముంది. అప్పనంగా కాకపోయినా, నామినల్‌ రేటుకి భూమిని అప్పగించేయడమంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. 'స్విస్‌ ఛాలెంజ్‌' అని చంద్రబాబు మీడియా ముందు ప్రకటించగానే, అంతా షాక్‌కి గురయ్యారు. 

విపక్షాల నుంచి అనుమానాలు దూసుకొచ్చాయి. అంతే, మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసేశారు. అసలు విపక్షాలకు స్విస్‌ ఛాలెంజ్‌ అంటే ఏంటో తెలియదంటూ దుమ్మెత్తి పోసేశారు. అంతే తప్ప, అది ప్రైవేటు రాజధాని అవుతుంది కదా.? అన్న విమర్శలకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. చెప్పడానికి ఆయన దగ్గర 'మేటర్‌' వుంటే కదా.! చంద్రబాబు విమర్శించేయమన్నారు, నారాయణ విమర్శించేశారంతే. 

ఎలాగూ విపక్షాల స్విస్‌ ఛాలెంజ్‌పై మండిపడతాయి. షరామామూలుగానే అధికార పక్షం నుంచి, 'అమరావతి వ్యతిరేకులు..' అన్న ఎదురుదాడి దూసుకొస్తుంది. మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఫిక్సయిపోవచ్చు.. అమరావతిలోకి వెళ్ళాంటే ఎంట్రీ టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనేమో.! బీ ప్రిపేర్డ్‌.

Show comments