కేసీఆర్‌ 'సచివాలయం' కల నెరవేరేదెన్నడో...!

కార్తీక మాసంలో  (నవంబరు) సచివాలయాన్ని కూలగొట్టి అత్యాధునికమైన, అద్భుతమైన సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల నెరవేరేలా కనబడటంలేదు. ఓ పక్క కూల్చివేత నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోపక్క తాజాగా ఏపీకి చెందిన సచివాలయం భవనాలు అప్పగించకూడదని ఆ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయిచడం కేసీఆర్‌ స్వప్నం సాకారం కాకుండా అడ్డుగా వచ్చాయి. 9,10 షెడూళ్లలోని సంస్థల విభజన, ఉమ్మడిగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించుకున్న తరువాతనే ఏపీ సచివాలయం భవనాలను అప్పగించాలని చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయించడం గులాబీ దళాధిపతి జీర్ణించుకోలేని విషయమే. 

సచివాలయం భవనాలు అప్పగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి దాన్ని ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు అందచేసింది. కేసీఆర్‌ స్వయంగా గవర్నర్‌ను కలిసి భవనాలను అప్పగిస్తూ ఏపీ సర్కారు కేబినెట్లో తీర్మానం చేసేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఆయన గవర్నర్‌ను రెండుసార్లు కలిసి అభ్యర్థించారు. కేసీఆర్‌ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గవర్నర్‌ మొన్న ఆంధ్రాకు వెళ్లినప్పుడు అప్పగింత విషయం చంద్రబాబుకు చెప్పగానే ఆయన మరో మాట మాట్లాడకుండా ఓకే అన్నారు. దీనిపై కేబినెట్లో చర్చించి లాంఛనంగా నిర్ణయం తెలియచేస్తామన్నారు. 

బాబు నుంచి సానుకూల సమాధానం రాగానే పనైపోయినట్లేనని భావించిన గవర్నర్‌ ఈ సంగతి కేసీఆర్‌ కు చెప్పేశారు. సచివాలయం భవనాలతోపాటు అసెంబ్లీ భవనాలను కూడా అప్పగించాలని కేసీఆర్‌ కోరగా, ఆంధ్రాలో సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక తీసుకోండని గవర్నర్‌ చెప్పినట్లు తెలిసింది. సచివాలయం భవనాలు అప్పగిస్తే అందుకు ప్రతిగా హైదరాబాదులో ఏపీ భవన్‌ కట్టుకోవడానికి సహకరించాలని చంద్రబాబు కోరగా అందుకు కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారట...! ఏపీ సర్కారు భవనాలు అప్పగిస్తుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ సచివాలయాన్ని (తెలంగాణ) పది రోజుల్లో వేరే భవనాల్లోకి తరలించాల్సిందిగా ఆదేశించారు. 

ఆంధ్రా సచివాలయం నడుపుకోవడానికి (వెలగపూడికి తరలిపోయాక కూడా కొందరు ఉద్యోగులు ఉన్నారు) ఓ భవనం కూడా కేటాయించారు. ఈలోగా  సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఓ పక్క విచారణ, మరో పక్క ఏపీ సర్కారు ప్రతికూల నిర్ణయంతో సీన్‌ రివర్స్‌ అయింది. సచివాలయం అప్పగింతపై నిర్ణయం తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సబ్‌ కమిటీని నియమించింది. దాని నివేదిక వచ్చాక అప్పగింతపై బాబు నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు సమయం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వెళతామని బాబు చెప్పినప్పటికీ విభజన సమస్యలన్నీ పరిష్కారమయ్యాకే భవనాలు అప్పగించాలని మంత్రులు పట్టుబట్టారు. 

ఏపీ కేబినెట్‌ సమావేశానికి ముందు రోజు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు  'రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల పంపకం విషయం తేలేవరకు సచివాలయం భవనాలు అప్పగించబోం' అని  అన్నారు. చివరకు ఆయన చెప్పినట్లే జరిగింది.  ఏపీ ప్రభుత్వం భవనాలను అప్పగిస్తుందనే నమ్మకంతో సచివాలయం ఖాళీ చేయించాలని ఆదేశించిన కేసీఆర్‌కు ఏపీ సర్కారు నిర్ణయం సహజంగా అయితే కోపం తెప్పించాలి. కాని ఆయన ఇప్పటివరకు స్పందించిన దాఖలా లేదు. అలాగే ఆయన పత్రిక 'నమస్తే  తెలంగాణ' కూడా స్పందించలేదు.

 కేబినెట్‌ సమావేశం గురించి ఆ పత్రికలో చిన్న సింగిల్‌ కాలం వార్త ప్రచురితమైంది. సచివాలయం భవనాల అప్పగింతకు సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించినట్లు రాసింది. కాని 'ఫైర్‌' అవలేదు. ఇది విచిత్రమే....!  హైదరాబాదులో ఏపీకి కేటాయించిన సచివాలయాన్ని, అసెంబ్లీ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించేస్తే ఉమ్మడి రాజధానిపై హక్కు వదులుకున్నట్లేనని టీడీపీ మంత్రులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. 'హైదరాబాదుపై హక్కు వదులుకోవద్దు' అని గట్టిగా కోరుతున్నారు.  విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థలను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది. 

కాని ఇందుకు తెలంగాణ సర్కారు 'ససేమిరా' అంటోంది. సచివాలయం, అసెంబ్లీ భవనాలు అడుగుతున్న తెలంగాణ పభుత్వం సంస్థల విభజన విషయంలో ఏపీకి సహకరించడంలేదని టీడీపీ మంత్రులు చెబుతున్నారు.  9,10 షెడ్యూళ్లకు సంబంధించి ఏపీకి న్యాయం జరిగేవరకు సచివాలయం, అసెంబ్లీ అప్పగించొద్దని టీడీపీ నాయకులు, మంత్రులు బాబును  కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ విభజన సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తారా? సచివాలయం కోసం ఘర్షణ పడతారా?

Show comments