ఫక్కున నవ్వండి.. పగలబడి నవ్వండి.. కడుపు చెక్కలయ్యేలా నవ్వండి.. ఎందుకంటే, చిన'బాబు' జోకేశారు. అదేనండీ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలియాస్ చిన'బాబు' పెద్ద జోకేసేశారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు రావట. ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్ష నేత ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారట.
వారెవ్వా, ఇంతకన్నా జోక్ ఇంకేమన్నా వుంటుందా.? అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి.. ఉత్తరాఖండ్‌లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.. అంటూ చినబాబు 'లా పాయింటు' లాగేశారు. పోనీ, ఫర్ సపోజు.. చినబాబు మాటే నిజమనుకుందాం. అలాంటప్పుడు, చినబాబుగారి తండ్రిగారు.. అదేనండీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎందుకు డిమాండ్ చేస్తున్నారట.?
ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ప్రకటన విన్నాక, చంద్రబాబుగారికి రక్తం మరిగిపోయిందట. అయ్యోపాపం, ఇప్పుడు నారా లోకేష్ మాటలు విన్నాసరే చంద్రబాబు రక్తం మరిగిపోద్దేమో.! 'ప్రత్యేక హోదా సంజీవని కాదు..' అని గతంలో చెప్పిన చంద్రబాబే, ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చి తీరాల్సిందేనంటున్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పబ్లిసిటీ కోసమే అయినా, ఆందోళన అయితే చేస్తున్నారు కదా ప్రత్యేక హోదా కోసం.? వాళ్ళందర్నీ నారా లోకేష్ వెర్రి వెంగళప్పలనుకుంటున్నారా ఏంటీ.!
'ఎవరన్నా నవ్వుకోనీ.. ఎవరన్నా ఏమన్నా అనుకోనీ.. నా నోటికొచ్చింది నేను మాట్లాడేస్తా..' అని చంద్రబాబు తనను తాను నిప్పు అని తనకు తానే కితాబులిచ్చేసుకుంటుంటారు. ఆయనగారి పుత్రరత్నమే కదా.. లోకేష్ కూడా అంతే. నవ్విపోదురుగాక మనకేటి.. అన్నట్లు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారన్నమాట.
ఉత్తరాఖండ్‌కీ, ఆంధ్రప్రదేశ్‌కీ పోలికేంటి.? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు పూర్తిగా వేరు. అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు అన్ని అర్హతలూ ఆంధ్రప్రదేశ్‌కి వున్నాయి. కానీ, రాజధాని లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద లోటు. అభివృద్ధి అంతా ఒకప్పుడు హైద్రాబాద్ చుట్టూ కేంద్రీకృతమవడంతోనే ఈ దుస్థితి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలన్నా ప్రత్యేక హోదా అత్యవసరం.
ఆంధ్రప్రదేశ్ ఖర్మ ఏంటంటే, అరకొరజ్ఞానం వున్న పొలిటికల్ మూర్ఖులే. ప్రత్యేక హోదా ఎందుకో తెలియదు, అసలు ప్రజల వెతలేంటో తెలియదు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎలా నష్టపోయిందో తెలియదు. అయినా, 'తండ్రిగారు పార్టీ అధినేత గనుక' తద్వారా వచ్చిన పార్టీ పదవితో, తానేదో పెద్ద మనిషిననుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
అయినా మన వెర్రిగానీ.. ప్రత్యేక హోదా హెరిటేజ్ సంస్థల వారసుల కోసం కాదనీ, భవిష్యత్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న సామాన్యుల కోసమనీ నారా లోకేష్‌కి ఎలా అర్థమవుతుంది.!