అదే పనిగా పొగిడితే అంతే సంగతులా?

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డీమానిటైజేషన్‌ మంచి పనా? కాదా? ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజుల వరకు ప్రజలంతా శభాష్‌ అన్నారు. ఇలా అన్నవారిలో నల్ల కుబేరులూ ఉన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ మంచి పనే కాని...అమలు తీరే బాగాలేదన్నాయి. కాని క్రమంగా సీన్‌ మారింది. ఎన్‌డీఏ పక్షాలు కూడా పెదవి విరుస్తున్నాయి. శివసేన మొదట్లోనే మోదీని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిపక్షాలతో చేతులు కలిపింది. డీమానిటైజేషన్‌ ప్రకటన రాగానే దిక్కుమాలిన నిర్ణయం అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరువాత మెచ్చుకున్నారు. 

మొదట్లో బ్రహ్మాండమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమంగా అసహనం ప్రదర్శించారు. తాజాగా తెలుగుదేశం నాయకులు మోదీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండటం విశేషం. అది కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడైన తరువాత. ఇద్దరు ముగ్గురు టీడీపీ నేతలు మోదీని తుగ్లక్‌ అన్నట్లు వార్తలొచ్చాయి. బంగారంపై ఆంక్షలను చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. తెలంగాణలో, ఏపీలో ఇప్పుడు నల్లధనం నిర్మూలన గురించి పాలకులు మాట్లాడటంలేదు. నగదు రహిత లావాదేవీలపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.  నల్లధనం నిర్మూలనకే నోట్లు రద్దు చేసినట్లు మోదీ ప్రకటించారు. 

నల్లధనం ఎంతవరకు నిర్మూలన అయ్యిందో, నల్లకుబేరులు ఎంతమంది పట్టుబడ్డారో ఎవ్వరికీ తెలియదు. నోట్ల రద్దు తరువాత నోట్లను మార్చుకునే విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు నల్లకుబేరులకు ప్రయోజనం కలిగిస్తూ జోరుగా కమిషన్లు దండుకుంటున్నారు. జనం ఇప్పటికీ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నల్లధనం నిర్మూలన కోసమే నోట్లు రద్దు చేశారని, దీంతో దేశం బాగుపడుతుందని పాలకులు, వారి పార్టీలకు చెందిన నాయకులు అదే పనిగా పొగిడితే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు. వారు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేదు. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలుగాని, మోదీ చర్యపట్ల సదభిప్రాయం ఉన్నవారుగాని అదే పనిగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఏపీలో అధికార పార్టీలో ఇదే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. డీమానిటైజేషన్‌, బంగారంపై ఆంక్షలు వగైరా అంశాలపై సానుకూలంగా మాట్లాడకూడదని, మోదీ చర్యలు మంచివంటూ అదేపనిగా భుజానేసుకొని మోయకూడదని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారట...! 

ఇప్పుడు మోదీని సమర్థిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా ఉంటుందని, బీజేపీ ప్రచారంతో జత కలిస్తే పార్టీ మటాష్‌ అవుతుందని అనుకుంటున్నారట...! డీమానిటైజేషన్‌ ప్రకటించకముందు నుంచే బీజేపీపై ఏపీలో ప్రజాగ్రహం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేయడం, సరైన ఆర్థిక సాయం చేయకపోవడం వగైరా కారణాలతో జనం ఆ పార్టీ పట్ల విముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోదీని మోసుకు తిరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని జనం తిరస్కరిస్తారని నాయకులు భయపడుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సారథ్యం వహించేందుకు మొదట్లో చంద్రబాబు వ్యతిరేకించారు. నాయకులు కూడా ఆ పని చేయొద్దని సలహా ఇచ్చారు. 

కాని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొంత భయపెట్టి, కొంత బుజ్జగించి కమిటీ ఛైర్మన్‌గిరీ అప్పగించినట్లు వార్తలొస్తున్నాయి.  ఇది డీమానిటైజేషన్‌ పర్యవసానాలను సమీక్షించే కమిటీ కాదని, దేశాన్ని నగదు రహితంగా మార్చే ప్రక్రియ రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే మునిగిపోవడం ఖాయమని అనేకమంది టీడీపీ నాయకులు అభిప్రాయపడుతూ భయపడుతున్నారట...! 

అందులోనూ ఆ పార్టీ అనుకూల మీడియా ఈమధ్య చేయించిన సర్వేలో బీజేపీతో కలవకుండా విడిగా పోటీ చేస్తేనే ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. దీనిపై కూడా నేతలు ఆలోచిస్తున్నారు. ఇదే అనుకూల మీడియా డీమానిటైజేషన్‌ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను బాగా హైలైట్‌ చేస్తూ మోదీ చేసిన పని బాగాలేదనే అభిప్రాయం కలిగిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో టీడీపీ-బీజేపీ సంబంధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Show comments