సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ట్యూబ్ లైట్

రంజాన్ వస్తే చాలు గుడ్డిగా బరిలోకి దిగిపోతాడు సల్మాన్. ఈద్ అంటే కండలోడికి అంత సెంటిమెంట్. అందుకు తగ్గట్టే రంజాన్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ ప్రతి సినిమా హిట్ అయింది. కేవలం హిట్ అవ్వడమే కాదు, రికార్డులు కూడా సృష్టించాయి కొన్ని సినిమాలు. కానీ ఈసారి రంజాన్ మాత్రం సల్మాన్ సెంటిమెంట్ కు బ్రేకులేసింది.

నిన్నమొన్నటి వరకు జస్ట్ 3 రోజులకే వంద కోట్లు కొల్లగొట్టే సల్మాన్.. తన లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్ తో మాత్రం వంద కోట్లు ఆర్జించడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు. ట్యూబ్ లైట్ మూవీ ఫ్లాప్ అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. అటు ఓవర్సీస్ లో కూడా ట్యూబ్ లైట్ సరిగ్గా వెలగడం లేదు.

2011 నుంచి ప్రతి రంజాన్ కు ఠంచనుగా హిట్ కొడుతున్నాడు సల్మాన్ ఖాన్. కిక్, ఏక్ థా టైగర్, బాడీగార్డ్, భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్.. ఈ సినిమాలన్నీ రంజాన్ సీజన్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రతి రంజాన్ కు సల్మాన్ రేంజ్ పెరిగింది.

ఈసారి ట్యూబ్ లైట్ మాత్రం సల్మాన్ కు రంజాన్ కానుక ఇవ్వలేకపోయింది. సల్మాన్ పోషించిన పాత్ర ప్రేక్షకులకే కాదు, అతడి అభిమానులకు కూడా నచ్చలేదు.

Show comments