'నేను మనం జనం..' పవన్‌ పుస్తకం.!

ఏంటో, సినీ నటుడు.. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆ మధ్య 'ఇజం' అనే పుస్తకాన్ని రూపొందించారు. ఇప్పుడు మరో పుస్తకం రాస్తున్నారు. కొత్త పుస్తకం పేరేంటో తెలుసా.? 'నేను మనం జనం'. సినిమా టైటిల్‌ ఓకే, ట్యాగ్‌లైన్‌ వుండాలి కదా.! ఇక్కడా ఓ ట్యాగ్‌లైన్‌ వుందండోయ్‌.. అదే 'మార్పు కోసం యుద్ధం'.! 

ఏం యుద్ధమో ఏమోగానీ, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఎవరికీ అర్థం కాడంతే. రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాలంటాడు.. అలా ప్రశ్నించడానికి జనం రోడ్డెక్కకూడదంటాడు. 2014 ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి ఓటెయ్యమన్నాడు.. ఇప్పుడేమో, ఆ రెండు పార్టీలనూ ప్రశ్నిస్తానంటాడు. బంద్‌లు చెయ్యొద్దంటాడు.. ఈయనేమో అమావాశ్యకీ, పున్నమికీ ఓసారి కనిపించి వెళతాడు. అంతా కన్‌ఫ్యూజన్‌. బహుశా దేశ రాజకీయాల్లోనే ఇంతటి కన్‌ఫ్యూజన్‌ వున్న పొలిటీషియన్‌ ఇంకొకరుండరేమో. 

అసలు, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ నాయకుడేనా.? ఆయన పార్టీ అసలు వుందా.? ఆ పార్టీ ఎన్డీయేలో ఎప్పుడు చేరింది.? ఎప్పుడు బయటకు వెల్ళింది.? అని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంటే, '2014 ఎన్నికల్లో మీ ప్రచారం చూసుకోండి.. నరేంద్రమోడీ పక్కన నేనున్నానో లేదో చూసుకోండి..' అని ప్రశ్నించలేని చేతకానితనం పవన్‌కళ్యాణ్‌ది. అయినా, ఆయన ప్రశ్నించేస్తాడండోయ్‌.! 

రెండున్నరేళ్ళవుతోంది పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి. ఏదీ ఇవ్వలేదాయె.! మొన్నటికి మొన్న ఇదే విషయమై ప్రశ్నిస్తే, 'ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలో చూద్దాం..' అంటాడాయన. అంతలోనే, తన అభిమాని ఒకరు హత్యకు గురైతే, హఠాత్తుగా నిద్రలేచి.. ప్రత్యేక హోదా కోసం ఇదిగో.. ఇలా ప్రశ్నించేశాడు. రాజకీయాల్లో ఇంత కన్‌ఫ్యూజన్‌తో వున్న పవన్‌కళ్యాణ్‌, జనాన్ని మార్చేస్తానంటూ పుస్తకం రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?  Readmore!

ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పుస్తకాలైనా, ఇంకోటైనా.. ఆన్‌లైన్‌లోనే జనం చదువుకుంటున్నారు. వన్డే మ్యాచ్‌ని చూసే ఓపిక, తీరిక లేక టీ20 మ్యాచ్‌ల వైపు మొగ్గుచూపుతున్న రోజులివి. పుస్తకాల్ని రాస్తా, జనంలోకి తీసుకెళ్తా, జనాన్ని చైతన్య పరుస్తా.. అంటే పరమ చెత్త కామెడీనే అయిపోతుంది. 'ఇజం' పుస్తకమొచ్చింది. అది ఎంతమందిని ప్రభావితం చేసింది.? ఇప్పుడీ పుస్తకం రెండు నెలల్లో వస్తే రావొచ్చుగాక, దీనితోనూ అంతే ప్రయోజనం. పవన్‌కళ్యాణ్‌ పాపులర్‌ ఫిగర్‌ గనుక, పుస్తకాలు కొనేందుకు ప్రయత్నిస్తారేమో, చదివేందుకు ఆసక్తి చూపిస్తారేమో. కానీ, పుస్తకాలు చూసి స్పందించే ఛాన్సే లేదు. ఎందుకంటే పుస్తకం రాస్తున్నది పవన్‌కళ్యాణ్‌ కదా.!

Show comments