ఖాన్స్‌ అండ్‌ కండిషన్స్‌

'మేమిద్దరం కలిసి పనిచెయ్యాలంటే మమ్మల్ని భరించే డైరెక్టర్‌ కావాలి..' అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌. సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ మధ్య వైరం అందరికీ తెల్సిన విషయమే. వీరిద్దరూ గతంలో 'కరణ్‌ అర్జున్‌' సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఇద్దరూ కలుసుకోవడం, మాటల తూటాలు సంధించుకోవడం మామూలే. 

తాజాగా ఓ ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసి దర్శనమిచ్చారు. 'మీరిద్దరూ కలిసి ఎప్పుడు మళ్ళీ నటిస్తారు.?' అన్న ప్రశ్నకు షారుక్‌ పై విధంగా సమాధానమిచ్చాడు. ఇదే ప్రశ్నకు సల్మాన్‌ ఖాన్‌ సమాధానం మాత్రం కూల్‌గా వుంది. 'మంచి దర్శకుడు, మంచి కథతో వస్తే.. తప్పకుండా కలిసి నటిస్తాం..' అని చెప్పాడు సల్మాన్‌ఖాన్‌. మరి, మీ మధ్య గతంలో జరిగిన గొడవల మాటేమిటి.? అనడిగితే, 'ఇలాంటి ప్రతి ఒక్కరికీ జరిగేవే.. అదేమంత పెద్ద విషయం కాదు.. జరిగింది చిన్నదే, దాని చుట్టూ జరిగిన ప్రచారమే ఎక్కువ..' అంటూ, గతంలో షారుక్‌తో తలెత్తిన విభేదాల్ని లైట్‌ తీసుకున్నాడు సల్మాన్‌ఖాన్‌. 

చూస్తోంటే సల్మాన్‌ ఖాన్‌ వైపు నుంచి క్లియర్‌గా వున్నా, షారుక్‌ నుంచే 'చిలిపితనం' మరీ ఎక్కువగా వున్నట్లు కన్పించకమానదు. ఇదే విషయాన్ని ఇంకో సందర్భంలో షారుక్‌ వద్ద ప్రస్తావిస్తే, 'సల్మాన్‌ అంటే నాకిష్టం.. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలుండొచ్చు.. అవి మేం విడిపోయేంత కాదు.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌.. సరదా స్టేట్‌మెంట్స్‌ ఇస్తుంటాను.. వాటిని మీడియానే వివాదం చేస్తోంది..' అంటాడు. 

ఏమో, ఏం చిలిపితనమోగానీ, ఈ చిలిపితనమే ఇద్దరి మధ్యా గ్యాప్‌ని అలా అలా పెంచేస్తోందంతే.

Show comments