ఈ ప్రశ్నలకు బదులెక్కడ.?

దేశాన్ని ఉద్ధరించేయడానికే పెద్ద సాహసం చేశాం.. అదే పెద్ద పాత నోట్ల రద్దు.. దీంతో, నల్లధనాన్ని అరికట్టగలం.. తీవ్రవాదాన్ని అణిచేయగలం.. అవినీతిని అంతమొందించగలం.. ఇవే, ఈ మూడు మాటలే చెప్పారు నవంబర్‌ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పెద్ద పాత నోట్ల రద్దుకి కారణాలుగా ఈ మూడు విషయాల్నీ నరేంద్రమోడీ ప్రస్తావించారు. దేశ ప్రజానీకం నరేంద్రమోడీని నమ్మారు. కష్టాల్ని భరించేద్దామనుకున్నారు. 

రెండు మూడు రోజులే కదా.. అనుకున్న దేశ ప్రజానీకానికి 50 రోజుల నరకం చూపించేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ యాభై రోజుల నరకం తప్పదనీ, అర్థం చేసుకోవాలనీ మోడీ విజ్ఞప్తి చేయడంతో, ఆ 50 రోజుల తర్వాత వచ్చే 51వ రోజు కోసం ఎదురుచూశారు.. భంగపడ్డారు. 50 ఔట్‌, 51 కూడా ఔట్‌.. 52 కూడా అంతే. 53 రానే వచ్చింది. అదే డిసెంబర్‌ 31వ తేదీ. ప్రదాని ఏం చెప్పారు.? అంటే, ఏమీ చెప్పలేదనే చెప్పాలి. 

ముచ్చటగా మూడే మూడు ప్రశ్నలున్నాయిప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ముందు. అవేంటంటే... 

మొదటి ప్రశ్న: 50 రోజుల్లో నల్లధనాన్ని అరికట్టారా.? ఆ నల్లధనాన్ని వెలికి తీశారా.? తీస్తే, ఆ నల్లధనం మొత్తం ఎంత వుంది.? 

రెండో ప్రశ్న: తీవ్రవాదాన్ని అణిచేస్తామన్నారు, అణిచేశారా.? దేశవ్యాప్తంగా పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఎంతమంది తీవ్రవాదులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.? ఎంతమంది తీవ్రవాదుల్ని గడచిన 50 రోజుల్లో అరెస్టు చేశారు, ఎన్‌కౌంటర్‌ చేశారు.? తీవ్రవాదుల నుంచి ఎంత మొత్తంలో పాత కరెన్సీని స్వాధీనం చేసుకోగలిగారు.? 

మూడో ప్రశ్న: అవినీతిని అంతమొందిస్తామన్నారు, దేశవ్యాప్తంగా అవినీతి అలాగే వుంది. పాత పెద్ద నోట్ల స్థానంలో, కొత్త పెద్ద నోట్లు అవినీతికి ఉపకరిస్తున్నాయి. నిజమా.? కాదా.? 

వీటన్నిటికన్నా కీలకమైన ప్రశ్న ఇంకోటుంది. 50 రోజుల తర్వాత పరిస్థితులు బాగుపడ్తాయన్నారు, ఇంకా బ్యాంకుల ముందు ప్రజలు తమ డబ్బుల కోసం బిచ్చగాళ్ళలా ఎదురుచూడాల్సిందేనా.? ఆ దుస్థితి ఇంకెన్నాళ్ళు.? 

ఇదొక్కటే కాదు, ఇంకో ముఖ్యమైన ప్రశ్న కూడా వుంది. గడచిన 50 రోజుల్లో రాజకీయ అవినీతి సంగతేంటి.? అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం, డబ్బు ప్రమేయం లేకుండా జరిగిందా.? పార్టీ ఫిరాయింపులు డబ్బుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయా.? రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న రాజకీయ అవినీతికీ కేంద్రానికీ సంబంధం వుందా.? లేదా.? 

పైన పేర్కొన్నవే కాదు, కుప్పలు తెప్పలుగా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. సోకాల్డ్‌ 'మోడీ' మాస్కులేసుకున్న మేధావులైనాసరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే చెప్పండి. ప్రపంచం మెచ్చేలా భారతదేశాన్ని తయారుచేయడం సంగతి దేవుడెరుగు.. ప్రపంచ దేశాలు భారతీయుడి ప్రస్తుత దయనీయ స్థితిని చూసి జాలిపడుతున్నాయి.. నమో మోడీ.. అని ఇంకా అనేద్దామా.?

Show comments