పవన్ కొలువులో బండ్ల

నిర్మాత బండ్లగణేష్ స్టయిలే వేరు. వేలు చూపించకుండానే పని కానిచ్చేయగలడు. మొత్తానికి గబ్బర్ సింగ్ టైమ్ లో పవర్ స్టార్ తో వచ్చిన విబేధాలకు తెరదించేయ గలిగాడు. దీంతో ఇప్పుడు శివుడి ముందు నందీశ్వరుడి మాదిరిగా పవర్ స్టార్ దగ్గరే వుంటున్నాడట. 

కాటమరాయుడు సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో వుండడంతో, అసలు నిర్మాత శరద్ మురార్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోమని,  బండ్ల సెట్ లో పనులు చక్కబెట్టేస్తున్నాడట. రోజూ, హాజర్ హూ... అంటూ కాటమరాయుడు సెట్ కు వెళ్లి, సాయంత్రం వరకు అక్కడే వుండి వస్తున్నాడట. ఎందుకిలా అని.. ఎప్పటిలాగే పవన్ తన దేవుడని.. ఇంకా ఏదోదో అని అలవాటైపోయిన డైలాగులు చెప్పేస్తున్నాడట. 

ఎలాగైనా సినిమా చేయాలనే ప్రయత్నంలో వున్నాడు బండ్ల. అయితే పవర్ స్టార్ తో సమస్యే లేదు. 2018 వరకు ఆయన బిజీ. పవన్ చెబితే సాయిధరమ్ తేజ అన్నా ఊ అంటాడేమో అన్న ఆశ అయివుండొచ్చు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా సినిమా ప్రొడక్షన్ చేసి ఏళ్లు దాటేస్తున్నా, ఎవ్వరూ డేట్లు ఇవ్వకపోయినా, వార్తల్లో నిర్మాతగా మాత్రం భలేగా వుంటున్నాడు బండ్ల.

Show comments