దండయాత్ర.. ఇది మోడీ దండయాత్ర.!

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అలా ఇలా కాదు, ఎవరూ ఊహించని అద్భుత విజయాన్ని బీజేపీ సొంతం చేసుకోబోతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి మొత్తం 305 స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య 403. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో 180 సీట్ల దాకా బీజేపీకి రావొచ్చని తేలింది. అయితే, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్ని తల్లకిందులు చేస్తూ, అనూహ్య విజయం దిశగా బీజేపీ దూకుడు కన్పిస్తోంది. 

అధికార సమాజ్‌ వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్‌ ఆశలు అడియాశలయ్యాయి. రెండు పార్టీలూ కలిసి నిండా మునిగిపోయాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, ఇది ఎవరూ ఊహించని ఫలితం. ఈస్థాయిలో తాము విజయం సాధిస్తామని బీజేపీ కూడా అనుకుని వుండదు. అదే విషయాన్ని, గెలుపు సంబరాల్లో మునిగి తేలుతోన్న బీజేపీ నేతలే చెబుతుండడం గమనార్హం. 

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో దండయాత్ర.. ఇది బీజేపీ దండయాత్ర.. నరేంద్రమోడీ దండయాత్ర.. అంటూ బీజేపీ శ్రేణులు నినదిస్తున్నాయి. పెద్ద పాత నోట్ల రద్దుపై నరేంద్రమోడీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నది బీజేపీ వాదన. మరోపక్క, యూపీలో బీజేపీ గెలుపు పరుగు నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు 'జై శ్రీరాం..'అంటూ నినదిస్తున్నారు. అతి త్వరలో అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడ్తామంటున్నారు. 

300 ప్లస్‌ సీట్లు బీజేపీ సాధించడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో బీజేపీ, ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే వుండకపోవచ్చు. మొత్తమ్మీద, యూపీ ఎన్నికల్లో చెప్పి మరీ, బంపర్‌ విక్టరీని బీజేపీకి అందించారు ప్రధాని నరేంద్రమోడీ. బీహార్‌ ఫలితాలు రిపీట్‌ అవుతాయి.. అని కాంగ్రెస్‌ చెప్పిన మాటలు తుస్సుమన్నాయి.. ఇప్పుడిక, కాంగ్రెస్‌ యూపీ రాజకీయాల గురించి మాట్లాడటానికేమీ లేనట్టే. ఎందుకంటే, ఉదయం పదిగంటలకే పరిస్థితి అర్థం చేసుకున్న సమాజ్‌వాదీ పార్టీ, తమను కాంగ్రెస్‌ నిండా ముంచేసిందని ఆరోపిస్తూ.. పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన రాహుల్‌ గాంధీ కటౌట్లను తీసి పారేసింది. 

Readmore!

మొత్తమ్మీద, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ సర్కార్‌పైనా, సమాజ్‌వాదీ - కాంగ్రెస్‌ కూటమిపైనా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ పైనా కాషాయదళం.. మరీ ముఖ్యంగా నరేంద్రమోడీ దండయాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యిందన్నమాట.

Show comments

Related Stories :