గ్యాంగ్‌స్టర్ నయీం, సినీ రంగంలో మాఫియా నడిపాడని ఆరోపిస్తున్నారు నిర్మాత నట్టికుమార్. బండ్ల గణేష్, సి.కళ్యాణ్ సహా పలువురు నిర్మాతలతో నయీంకి సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలు తన వద్ద వున్నాయని ఆయన చెబుతున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌లో చనిపోయినా, నయీం గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే వుందని నట్టికుమార్ చెబుతుండడం గమనార్హం.
ఇక, నట్టికుమార్ ఆరోపణల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు పేరు తెరపైకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మెజార్టీ పోలీసు ఉన్నతాధికారులు అచ్చెన్నాయుడు బంధువులేననీ, చాలా థియేటర్లలో క్యాంటీన్ల నిర్వహణ నయీం కనుసన్నల్లో జరుగుతోందనీ, వాటిల్లో నయీంకి భాగస్వామ్యం వుందని నట్టికుమార్ ఆరోపించారు. నరసన్నపేటలో తనకు చెందిన ఓ థియేటర్‌ని నయీం బలవంతంగా లాక్కున్నాడనీ, ఇదే విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడికి చెబితే, 'సెటిల్ చేసుకోమని' ఉచిత సలహా ఇచ్చారని నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైద్రాబాద్‌లో నయీం అనుచరులు ఓ ఎమ్మెల్యేకి చెందిన గెస్ట్ హౌస్‌లో ఇప్పటికీ ఆయుధాలతో స్వేచ్ఛగా వున్నారని నట్టికుమార్ ఆరోపిస్తుండడం గమనార్హం. మల్కాజిగిరి ఎమ్మెల్యేపైనే నట్టికుమార్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ గెస్ట్ హౌస్‌ని నయీంకి ఆ ఎమ్మెల్యే అమ్మేశారా.? అప్పగించారా.? అనేది పోలీసులే విచారణ చేసి, వాస్తవాలు వెల్లడించాలని నట్టికుమార్ డిమాండ్ చేసేశారు.
నయీం బెదిరింపుల కారణంగా కోటి రూపాయల విలువైన సినిమా థియేటర్‌ని తాను 25 లక్షలకే కోల్పోవాల్సి వచ్చిందన్నారు నట్టికుమార్. సినీ రంగానికి చెందిన పలువురు, నయీంతో కలిసి రియల్ ఎస్టేట్ దందా నిర్వహించారనీ, చిన్న నిర్మాతల్ని నయీం ద్వారా వారంతా బెదిరించేవారనీ, వాటికి తగ్గ ఆధారాలతో త్వరలో తాను మరోసారి మీడియా ముందుకొస్తానని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.