నాయకులు ఒప్పుకున్నారు...జనం తిరస్కరిస్తున్నారు...!

ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే తోటి నాయకులు మద్దతు ఇస్తే సరిపోతుందా? వారు జేజేలు కొడితే అయిపోతుందా? కాదు. జనం మద్దతు ఇవ్వాలి. వారు జేజేలు పలకాలి. ప్రజలు ఒప్పుకున్నవాడే నాయకుడవుతాడు. వారు ఆదరించినవారే అధికారం అందుకుంటారు. తమిళనాడులో దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళా నటరాజన్‌ పరిస్థితి విచిత్రంగా ఉంది. 'అమ్మ' పోయినా చిన్నమ్మ అమ్మలా దొరికిందని అన్నాడీఎంకే నాయకులు సంతోషించారు. చిన్నమ్మలో అమ్మను చూసుకున్నారు. భవిష్యత్తులో అమ్మను మించిన అమ్మ అవుతుందని ఆశిస్తూ ఆమెకు పార్టీ అధినేత్రిగా పట్టాభిషేకం చేశారు. శశికళ అమ్మ జయలలితను కాపీ కొడుతూ, ఆమెలా వస్త్రధారణ చేసుకుంటూ, ఆమెలా పార్టీ నాయకులను ఆశీర్వదిస్తూ, అభినందనలు తెలుపుతూ, అభివాదం చేస్తూ, పెత్తనం చెలాయిస్తూ, ఆమెను తలపించేలా వ్యవహరిస్తోంది. తాను జయ అడుగుజాడల్లోనే నడుస్తానని, ఆమె విధానాలనే అనుసరిస్తానని చెప్పింది. ఈ లెక్క ప్రకారం శశికళ జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కె నగర్‌ నియోజకవర్గం నుంచే ఉప ఎన్నికలో పోటీ చేయాల్సివుంది. ఇక్కడి నుంచే పోటీ చేస్తుందని మొన్నటివరకు వార్తలొచ్చాయి.

కాని ఆ నియోజకవర్గం జనం చిన్నమ్మను వ్యతిరేకిస్తున్నారు. ఆమెలో 'అమ్మ'ను చూసుకోలేమంటున్నారు. శశిని నాయకులు అంగీకరించినా జనం ఒప్పుకోవడంలేదు. ఆమె ఆర్‌కె నగర్‌ నుంచి పోటీ చేయడానికి వీల్లేదంటున్నారు. జయలలిత 75 రోజులు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం గురించి చిన్నమ్మ ఎందుకు తెలియచేయలేదని ఆర్‌కె నగర్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జయ అనారోగ్యం, చికిత్స గురించి బయటకు రాకుండా శశికళ తొక్కిపెట్టిందనే అభిప్రాయం ప్రజలకు ఉందని అర్థమవుతోంది. ఈ నియోజకవర్గంలోని ప్రజలు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. జయకు ఆమె నిజమైన వారసురాలని కొందరు చెప్పారు. శశికళను మదురై ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్నాడీఎంకే నాయకులు కొందరు సూచించారు. ఆమె కోసం రాజీనామా చేస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. మరో నాలుగు నెలల్లో ఆర్‌కె నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. మరి చిన్నమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మూడు దశాబ్దాల క్రితం ఏరికోరి జయలలితతో స్నేహం చేసి, ఆమె మనసు చూరగొని, ఆమె ప్రాణ స్నేహితురాలిగా మారి, ఆమె ఇంట్లోనే తిష్ట వేసిన శశికళ అన్నివిధాలుగా జయలలితను కాపీ కొడుతోంది. మళ్లీ 'అమ్మ' తిరిగి వచ్చిందని భ్రమ కలిగించేలా ప్రవర్తిస్తోంది.  వేషధారణలో, హావభావాల్లో జయను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తోంది. జయ మరణించేవరకు తనదైన కట్టుబొట్టులో కనబడిన చిన్నమ్మ ఇప్పుడు మరోలా కనబడుతోంది. జయలలితకు ముదురాకు పచ్చ చీరలు  ఇష్టం. ఆమె చనిపోయినప్పుడు కూడా అదే రంగు చీర ధరించి ఉన్నారు. తాను జయ మాదిరిగా కనబడాలంటే ముదురాకు పచ్చ రంగు చీరలే కట్టుకోవాలని తెలుసుకుంది శశికళ. నాయకులు ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన రోజు, బాధ్యతలు స్వీకరించిన రోజు జయకు ఇష్టమైన ముదురాకు పచ్చ రంగు చీర, బ్లౌజు ధరించింది చిన్నమ్మ. హెయిర్‌ స్టయిల్‌ కూడా అమ్మను గుర్తుకు తెచ్చేలా మార్చుకుంది. జయలలిత కాలర్‌ నెక్‌, మోచేతుల వరకు ఉండే బ్లౌజులు ధరిస్తారు. శశికళ కూడా ఇదే కాపీ కొట్టింది. పోయస్‌ గార్డెన్‌ భవనం నుంచి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేయడంలో కూడా జయ శైలిని అనుసరించింది. 

శశికళ కాపీయింగ్‌ అన్నాడీఎంకే నాయకులను అబ్బురపరచడమే కాకుండా ఎంతో సంతోషపెట్టింది. జయ కట్టుబొట్టును, ఆహార్యాన్ని కాపీ కొట్టినంత మాత్రాన శశికళకు జయలోని 'క్వాలిటీస్‌' రావు.  ఆమె బహుభాషా కోవిదురాలు. తొమ్మిది భాషల్లో (తెలుగు సహా) అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యముంది. దక్షిణాదివారు హిందీ సరిగా మట్లాడలేరనే అభిప్రాయముంది. హిందీ ద్వేషులనే ప్రచారమూ ఉంది. జయలలిత ఓసారి ఉత్తర భారతంలో చేసిన (బహరంగ సభలో) హిందీ ప్రసంగం అక్కడివారిని అబ్బురపరిచింది. ఓసారి అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించి ఆశ్యర్యం కలిగించారు. ఆమె ఇంగ్లీషు పాండిత్యం అమోఘం. ఆమె రాజ్యసభకు ఎన్నికైనప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జయ ఇంగ్లీషు ప్రసంగం వినడానికే  ప్రత్యేకంగా సభకు వచ్చేవారట. జయలో మరో క్వాలిటీ పుస్తకాల పురుగు కావడం. ఆమె ఇంట్లోనే పెద్ద గ్రంథాలయం ఉంది. ఇక రాజకీయాల్లో ఆమె ఎత్తుగడలు, పరిపాలనా సామర్థ్యం...ఇలాంటివెన్నో ఉన్నాయి. ఈ క్వాలిటీస్‌ చిన్నమ్మకు ఉన్నాయా? ఇప్పటివరకు  తెలిసిన సమాచారం ప్రకారం జయకు, శశికి ఒకే పోలిక ఉంది. ఇద్దరి చదువు పదో తరగతే. కాని జయలలిత చదువుకు అతీతంగా ఎదిగారు. మరి శశికళ నాలెడ్జ్‌ ఏమిటో తెలియదు.` Readmore!

Show comments