22న విశాఖ‌లో టీడీపీ, వైసీపీ ఢీ

అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉక్కు న‌గ‌రం విశాఖ వేదిక‌గా ఢీ అంటే ఢీ అంటున్నాయి. జిల్లాలో జ‌రుగుతున్న భూకుంభ‌కోణాల‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 22 విశాఖ‌లోని మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట భారీ ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్టు వైసీపీ ప్ర‌క‌టించింది.

దీనికి ప్ర‌తిగా అదే రోజు మ‌హా సంక‌ల్ప దీక్ష పేరిట టీడీపీ న‌గ‌రంలో హ‌డావుడి చేయ‌నుంది. దీంతో న‌గ‌రంలో ఆరోజు ఉద్రిక్త‌ ప‌రిస్థితులు నెల‌కొనే అవ‌కాశం ఉంది.

విశాఖ భూ కుంభ‌కోణంలో ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని, క‌బ్జాల మూలాలు తెలియాలంటే సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌తోపాటు మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. స్వ‌యానా మంత్రి అయ్య‌న్న పాత్రుడైతే కుంభ‌కోణంలో స‌హ‌చ‌ర మంత్రి గంటా శ్రీ‌నివాస్ పాత్ర ఉంద‌ని బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు.

కుంభ‌కోణంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇంకా అనేక మంది ఉన్నందున మూలాలు త‌వ్వితే పార్టీ, ప్ర‌భుత్వం ప‌రువు మంట‌గ‌లిసే ప్ర‌మాదం ఉన్నందున సిట్ పేరిట తూతూ మంత్రం విచార‌ణ క‌మిటీని వేసి చేతులు దులుపుకున్నాడు చంద్ర‌బాబు.

దీనిపై విశాఖ ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ నిర్ణ‌యించింది. ఇందుకోసం ఈనెల 22న క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టింది. వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఇందులో పాల్గొంటారు. 

అయితే జ‌గ‌న్ ధ‌ర్నాకు దీటుగా అదే రోజు మ‌హా సంక‌ల్ప దీక్ష పేరిట టీడీపీ నేత‌లు భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. జిల్లా నాయ‌కులు, మంత్రులు ఇందులో పాల్గొనే అవ‌కాశం ఉంది.

దీంతో న‌గ‌రంలో ఉద్రిక్త‌త‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌నే సాకుతో జ‌గ‌న్ ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి జ‌గ‌న్ ధ‌ర్నాను ఎలాగోలా అడ్డుకోవాల‌నే ఆలోచ‌న‌తోనే మ‌హా సంక‌ల్ప దీక్ష ప్లాన్ వేశారు టీడీపీ నేత‌లు. అయితే వైసీపీ మాత్రం ధ‌ర్నా నిర్వ‌హించి తీరుతాం అనే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

గ‌త జ‌న‌వ‌రి 26న రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కోరుతూ విశాఖ బీచ్‌లో జ‌ల్లిక‌ట్టు త‌ర‌హా ఆందోళ‌న నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ వెళ్ల‌గా విమానాశ్ర‌యంలోనే అరెస్ట్ చేసి తిరిగి హైద‌రాబాద్ పంపారు. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిణామాలు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని ఊహిస్తున్నారు.

Show comments