తిట్టు తిట్టుకీ 'బోనస్‌' పాయింట్‌.!

పేరుకే సీనియర్‌.. కానీ, ఆ సీనియారిటీ హుందాతనం చూపించడానికి మాత్రం పనికిరావడంలేదు. హుందాతనం లేని అనుభవం ఎందుకోసమట.? గతంలో మంత్రిగా పదవి వెలగబెట్టేశారు.. ఎమ్మెల్యేగా పనిచేశారు.. ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నారు. ఏం లాభం.? వయసు అంటే మీద పడిందిగానీ, హుందాతనం మాత్రం బొత్తిగా కన్పించడంలేదాయనగారికి. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఆయన. ఆయనెవరో కాదు, జేసీ దివాకర్‌రెడ్డి. 

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నోటికి హద్దూ అదుపూ ఏమీ వుండవు. ఆయనంతే, అదో టైపు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని పట్టుకుని 'వెధవ' అనేందుకు సంస్కారం బహుశా ఆయనకు మాత్రమే పేటెంట్‌ అనుకుంటారేమో.! పేటెంట్‌ కాదు, ఇంకేమీ కాదు. అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఆయనలా పాకులాడుతుంటారంతే. ఒకప్పుడు ఇదే జేసీ దివాకర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ భజన చేసిన మాట ఎలా మర్చిపోగలం.? రాజకీయాలన్నాక వీరు వారవుతారు, వారు వీరవుతారు. అలాగని, 'వెధవ' అనేంత కుసంస్కారం ప్రదర్శించడం జేసీ దివాకర్‌రెడ్డికి తప్ప ఇంకెవరికీ చెల్లదు. 

తాను తిట్టే ప్రతి తిట్టుకీ, చంద్రబాబు ఓ బోనస్‌ పాయింట్‌ని తన ఖాతాలో వేస్తారని జేసీ దివాకర్‌రెడ్డి పాకులాడుతున్నారేమో అన్పిస్తుంటుంది. నిజమే మరి, జేసీ దివాకర్‌రెడ్డి ఎక్కువగా చంద్రబాబు సమక్షంలోనే జగన్‌ మీద విరుచుకుపడిపోతుంటారు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ, చంద్రబాబు మురిసిపోతుంటారు.. ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటుంటారు. ఇలా జేసీ సంయమనం కోల్పోతున్న ప్రతిసారీ, 'ఆయన మత్తులో వున్నారు..' అనే విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. 'అబ్బే, నాకు ఆ అలవాటే లేదు..' అని ఆయన వివరణ ఇచ్చుకుంటుంటారనుకోండి.. అది వేరే విషయం. 

'కుల పిచ్చితో జగన్‌ దగ్గరకు వెళ్ళాలనుకుంటానుగానీ..' అనడంలోనే, జేసీ దివాకర్‌రెడ్డి తన నైజం ఏంటో బయటపెట్టేసుకున్నారు. ఇప్పటికి ఇలా, 2019 ఎన్నికల నాటికి ఎలా మారిపోతాయో. అప్పుడు ఆయన వైఎస్సార్సీపీలో చేరినా చేరొచ్చు. అప్పుడు చంద్రబాబుపై 'వెధవ' కామెంట్లు చెయ్యరన్న గ్యారంటీ ఏముంది.? ఆయనకు 'బోనస్‌ పాయింట్లు' కావాలి మరి.!

Show comments