బాబు చినబాబు.. సోషల్ బూమరాంగ్

నానా హైరానా పడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, తెలంగాణలో వున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అదీ, తెల్లవారు ఝామున.. ఇంటి నుంచి సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసి, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్‌కి తరలించారు. అటు తిప్పారు, ఇటు తిప్పారు.. ఎక్కడెక్కడో తిప్పారు.. చివరకు ఓ చోట విచారించి, ఆ తర్వాత కొన్ని పేపర్లపై సంతకాలు చేయించుకుని, వదిలేశారు.! 

ఇంతకీ, దీన్ని అరెస్ట్‌ అని భావించాలా.? ఉత్తుత్తి విచారణ అనుకోవాలా.? విచారణ పేరుతో బెదిరింపులకు దిగారని అనుకోవాలా.? ఇక్కడ బాధితుడి పేరు ఇంటూరి రవికిరణ్‌. పొలిటికల్‌ పంచ్‌ నిర్వాహకుడు. సోషల్‌ మీడియా వేదికగా పొలిటికల్‌ పంచ్‌ అనే పేజీని నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌కి, 'పప్పు' అంటే చాలా ఇష్టమేమో. ఆ పప్పు పేరుతోనే, చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్‌ మీద పొలిటికల్‌ పంచ్‌లు పేల్చాడు. సోషల్‌ మీడియాలో ఇవన్నీ కామన్‌. 

పెద్దల సభ శాసన మండలి 'పెద్దలకు మాత్రమే' అని అర్థం వచ్చేలా వేసిన పొలిటికల్‌ పంచ్‌ నేపషథ్యంలో ఇంటూరి రవికిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అక్కడికెళ్ళాక, 'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదు..' అంటూ గతంలో ఓ సారి ఎమ్మెల్యే అనిత మీద వేసిన పొలిటికల్‌ పంచ్‌ నేపథ్యంలో ప్రశ్నలు సంధించారట పోలీసులు. ఈ వివరాలన్నిటినీ, పోలీసులు విడిచిపెట్టాక రవికిరణ్‌ వెల్లడించాడు. 

సాక్షి కోసం, వైఎస్సార్సీపీ కోసం పనిచేస్తున్నానని ఒప్పుకుంటే ఎలాంటి కేసులూ లేకుండా వదిలేస్తామని పోలీసులు చెప్పారంటున్నాడు రవికిరణ్‌. అయితే, తాను తన స్వంతంగా ఆ పేజీని నిర్వహిస్తున్నానని పోలీసులతో చెప్పాడట. అయినాగానీ, పోలీసులు వదిలేశారట. ఈ నెల 25వ తేదీన తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌కి విచారణ నిమిత్తం రావాలని పోలీసులు, అతనికి సూచించారట. 

ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికీ అర్థం కాని విషయమేంటంటే, కేసు ఏమిటి.? అసలు రవికిరణ్‌ అరెస్టయ్యాడా.? లేదా.? అరెస్టయితే, అతన్నెందుకు విడిచిపెట్టారు.? అనే. ఏదో చేద్దామనుకున్నారు.. ఇంకేదో అయ్యేలా అన్పించింది.. దాంతో, వ్యవహారం బెడిసికొట్టేసింది. దాంతో, ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి.. సింపుల్‌గా పోలీసులు వదిలిపెట్టేశారు. ఇది, అందరికీ అర్థమవుతున్న విషయం. ఈ మాత్రందానికి పోలీసుల్ని ఆఘమేఘాల మీద హైద్రాబాద్‌కి అమరావతి నుంచి పంపించాల్సిన అవసరం వుందంటారా.? వ్యవస్థల్ని ఎలా చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేస్తోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. 

కొసమెరుపు: ఇప్పటిదాకా పెద్దగా ఎవరికీ తెలియని 'పొలిటికల్‌ పంచ్‌' ఈ వివాదం పుణ్యమా అని పాపులర్‌ అయ్యింది. ఇంటూరి రవికిరణ్‌ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. 

Show comments