ప్రమాదమేనా.? హత్యాకాండ ఎందుక్కాకూడదు.!

16 మంది ప్రాణాలు కోల్పోవడమంటే చిన్న విషయం కాదు. అదీ ఓ రోడ్డు ప్రమాదంలో. పైగా, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏ ప్రశ్నకీ సమాధానం దొరకడంలేదు. సరైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తి, ఓ భారీ లారీకి డ్రైవర్‌. అసలు, ప్రమాదం జరిగిన సమయంలో లారీని నడిపిందెవరు.? అన్న ప్రశ్నకే ఇంకా సరిగ్గా సమాధానం దొరకని పరిస్థితి. ప్రస్తుతానికైతే డ్రైవర్‌ ప్రమాదంలో గాయపడ్డాడు గనుక, అతను చెప్పిందే వేదం. 

కానీ, వాహనాన్ని క్లీనర్‌ నడిపాడనీ, అతనే ఈ ప్రమాదానికి కారకుడనీ అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రంగా క్లీనర్‌ తప్పించుకున్నాడు. అతన్నిప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇసుక మాఫియాపై మండిపడ్తున్న రైతులు, పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో పోలీస్‌ స్టేషన్‌కి చేరుకోవడం, సరిగ్గా ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. 

ఇదంతా ఇసుక మాఫియా కనుసన్నల్లో జరిగిన హత్యాకాండ.. అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమంటూ అధికార పార్టీ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా ఊరు ఊరంతా ఒక్కటైనప్పుడు, ఆ ఊరినే స్మశానంగా మార్చేయాలని అనుకోవడం ఇసుకాసురులకు పెద్ద కష్టమేమీ కాదు. గతంలో ఇసుక మాఫియా అధికారుల మీద ఏ స్థాయిలో దాడులు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

తహసీల్దారు వనజాక్షి మీద ఇసుక మాఫియా విరుచుకుపడితే, ఆ ఇసుక మాఫియాకి అండగా అధికార పార్టీ నేతల నిలబడితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో 'ఇసుక మాఫియా' హైలైట్‌ కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా రంగంలోకి దిగి, వనజాక్షికి క్లాస్‌ తీసుకున్న విషయాల్ని ఎలా మర్చిపోగలం.? పైగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా, చంద్రబాబు తనయుడు లోకేష్‌ కనుసన్నల్లో నడుస్తోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో వున్నాయి. 

ఏర్పేడు ప్రమాద బాధితుల కుటుంబాల్ని నిన్న మంత్రి హోదాలో లోకేష్‌ పరామర్శించినప్పుడు, బాధితుల నుంచి దూసుకొచ్చిన ప్రశ్నలతో ఆయనలో అసహనం వెల్లువెత్తింది. అంతే తప్ప, ఇసుక మాఫియానే ఈ హత్యాకాండకి కారణమయి వుంటుందేమో అన్న మాట మాత్రం యాన నోట రాలేదు. కనీసం, ఆ దిశగా విచారణ చేపడ్తామని కూడా చెప్పలేకపోయారాయన. 

''ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకే మా కుటుంబాలకీ దుస్థితి.. పోలీసులు సకాలంలో స్పందించి వుంటే ఇంత దారుణం జరిగి వుండేది కాదు.. ఎక్స్‌గ్రేషియా ఇస్తారా.? దానికి రెండింతలు మేమిస్తాం, మా కుటుంబ సభ్యుల్ని ప్రాణాలతో తీసుకొస్తారా..?'' అంటూ బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. వారి ప్రశ్నలకు బదులిచ్చేదెవరు.? నదీగర్భాల్ని దోచేస్తోన్న ఇసుకాసురులకు కొమ్ముకాస్తున్న అధికార పార్టీ, పోయిన ప్రాణాలకు వెల కట్టగలదేమోగానీ.. ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేయగలదా.? ఛాన్సే లేదు.

Show comments