ఈ మాటలేంటి మోడీజీ.. పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారే!

మొత్తానికి ప్రధానమంత్రి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు ఇక్కట్ల పాలు అవుతుండటంతో, వారిలో తనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో… రివర్స్ లో వచ్చాడు ప్రధాని. సంచలన నిర్ణయం తీసుకున్నా… అవినీతి పరుల ఆటకట్టించా.. ఇక వాళ్లు కాచుకోవాలి.. అనే టోన్ లో కాకుండా, వాళ్లు తనను చంపేస్తారేమో.. అనే మాట మాట్లాడటం ద్వారా మోడీ జాలిని కోరుకున్నాడు. ప్రజల నుంచి సానుభూతిని ఆశిస్తున్నారని స్పష్టం అవుతోంది!

తన ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని, నల్ల ధనికుల తనను చంపేస్తారని.. అని బేలగా మాట్లాడాడు మోడీ. ఇక్కడ బేలతనం వ్యక్తం చేయడం.. సానుభూతిని ఆశించడమే అనుకోవాల్సి వస్తోంది. తను సంధించిన అస్త్రం మిస్ ఫైర్ అయ్యింది… ఇక్కడ నల్లధనికులు దొరకడం కన్నా, సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం అవుతోంది. 

ఈ నేఫథ్యంలో అవినీతి రహిత భారతాన్ని అందిస్తా.. అనే డైలాగ్ చెబుతూ, దీనికి మరో 50 రోజుల గడువు అడిగాడు ప్రధానమంత్రి. అయినా.. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తెప్పిస్తామని చాలెంచ్ చేసి, ప్రజలకు ఈ మేరకు హామీని ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్లు వీళ్లు. రెండున్నర సంవత్సరం గడిచిపోయినా.. ఆ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఒక్కో అకౌంట్ లోకి పదిహేను లక్షలు వేస్తామనే హామీని తమ మ్యానిఫెస్టోలో పెట్టి.. 150 రోజులు గడువు అడిగారు. ఇప్పుడు మరో 50 రోజుల్లో అవినీతి రహిత భారతం అంటున్నారు!

ఇక్కడ అవినీతి రహితం సీన్ లేదు కానీ.. 50 రోజులకైనా కరెన్సీ కష్టాల నుంచి బయటపడేస్తానని మోడీ చెప్పినట్టు అనుకోవాలి.  ఆ విధంగా వెయిట్ చేయమంటూ మోడీ భావోద్వేగాలను పండించే యత్నం చేశాడు.  Readmore!

ఇక కుటుంబాన్ని త్యాగం చేయడం తన దేశభక్తికి, ప్రజలకు సేవ చేయాలన్న తపనకు నిదర్శనంగా చెప్పుకున్నాడు  మోడీజీ. ఇలాంటి అస్త్రాలను ఆయన సంధిస్తున్న తీరును చూస్తే.. నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. కుటుంబాన్ని కాదు.. అసలు పెళ్లిళ్లే చేసుకోని రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు. జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ .. వీళ్లంతా వివాహాలకు దూరంగానే ఉన్నారు. అంతవరకూ ఎందుకు.. రాహుల్ గాంధీ కూడా తను దేశ సేవ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు… అని అంటే బీజేపీ ఒప్పుకుంటుందా!

ఏతావాతా.. సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. సగటు మానవుడికి ఇబ్బందులు లేకుండా చూడటంలో పూర్తిగా విఫలం అయ్యాడు.. ఈ నేపథ్యంలో ఆయన సానుభూతిని ఆశిస్తున్నాడు! 

Show comments