రాజకీయాల్లో నేను నిప్పులా బతికానంటూ 'తుప్పు పట్టేసిన డైలాగులు' చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తర్వాతే ఎవరైనా. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిపోయిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిప్పులాంటి కబుర్లు చెబుతుంటారు. 'బ్రీఫింగ్ చేస్తూ' దొరికిపోవడం ఎలాంటిదో, అసభ్యకరంగా వీడియోకి చిక్కి బుక్కయిపోవడం కూడా అంతే. దానికీ దీనికీ పెద్దగా తేడా లేదు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన మంత్రి వర్గంలో ఒకరిపై 'అసభ్యకరమైన ఆరోపణలు' రావడంతోనే, పదవిలోంచి అతన్ని పీకి పారేశారు. మంత్రిగా పనిచేసిన సందీప్‌కుమార్‌కి ఉద్వాసన పలికేసిన కేజ్రీవాల్, అందరితోనూ 'నువ్వు సూపరెహె..' అన్పించుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తే అయినా, క్షమించరాని నేరం చేశాడంటూ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా సందీప్‌కుమార్ తీరుని కడిగి పారేశారు.
సందీప్‌కుమార్‌కి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు.. సీడీ రూపంలో తనకు అందాయని సోషల్ మీడియాలో వెల్లడించిన కేజ్రీవాల్, ఆ కారణంగానే అతన్ని తొలగించాననీ, తొలగింపు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించేయడం గమనార్హం. తెలంగాణలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్యపై అవినీతి ఆరోపణలు చేసి మరీ, అతన్ని తొలగించిన కేసీఆర్.. ఆయన్ని పార్టీలోనే కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఇక్కడ ఇంకోసారి చెప్పుకోవడమే శుద్ధ దండగ.
ఆరోపణలు వస్తూనే, బుకాయించేసి.. కేసులు నమోదైనాసరే 'స్టే' తెచ్చుకుని.. అబ్బో, దిక్కుమాలిన రాజకీయాలు చేసేవారికి, కేజ్రీవాల్ తన చర్యలతోనే 'చెంపదెబ్బ' కొట్టినట్లయ్యింది. ఎంతైనా కేజ్రీవాల్ డైనమిక్ అంతే.